ధర్నా చేస్తున్న లోకో, అసిస్టెంట్ లోకో పైలెట్లు
లోకో, అసిస్టెంట్ లోకో పైలెట్ల ధర్నా
ప్రజాశక్తి – పలాస
ఖాళీగా ఉన్న లోకో పైలెట్, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టులను భర్తీ చేయాలని ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోషియేషన్ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోషియేషన్ ఆధ్వర్యాన లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లు పలాస రైలు నిలయం ఆవరణలో బుధవారం ధర్నా చేపట్టారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో, ప్రసుత్తం పనిచేస్తున్న వారిపై పనిభారం పడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. తమ సమస్యల పరిష్కారానికి రైల్వేశాఖ ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు. గతంలో 120 కిలోమీటర్ల దూరం పనిచేస్తే రిలీవ్ చేయడంతో తమకు ఇబ్బంది ఉండేది కాదన్నారు. నేడు 12 గంటల పాటు పనిచేయిస్తోందని చెప్పారు. లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లకు తొమ్మిది గంటల పని అనంతరం రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ విధి నిర్వహణ పూర్తయి మార్గమధ్యంలో ఎక్కడైనా దిగితే అక్కడ కనీస మౌలిక సదుపాయాలు ఉండవని చెప్పారు. కష్టాలు పడుతూనే తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో పలాస కేంద్రం పరిధిలోని లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లు, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.