వంశ’ధార’ పారేనా?

వంశధార రైతులకు

సరుబుజ్జిలి మండలం శ్యామలాపురంలో పేరుకుపోయిన గుర్రపుడెక్క

* కాలువల్లో పెద్దఎత్తున పేరుకుపోయిన గుర్రపుడెక్క

* ఐదేళ్లుగా పైసా ఇవ్వని ప్రభుత్వం

* ఏటా జిల్లా నిల్వల నుంచే కేటాయింపు

* నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న అధికారులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

వంశధార రైతులకు ఈ ఏడాదీ సాగునీటి సమస్యలు పునరావృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుడి, ఎడమ రెండు కాలువల్లోనూ విపరీతంగా గుర్రపుడెక్క పేరుకుపోయింది. ఖరీఫ్‌ సీజన్‌ మొదలైనా నేటికీ పనులు చేపట్టలేదు. దీంతో శివారు భూములకు సాగునీరు అందడంపై అనేక సందేహాలు నెలకొన్నాయి. గుర్రపుడెక్క, పూడికతీత పనులకు ప్రభుత్వం ఐదేళ్లుగా ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదు. జిల్లాలో అందుబాటులో ఉన్న నిధులతోనే నెట్టుకొస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రతి ఏడాదీ ఈ పనులను ఆలస్యంగా మొదలుపెట్టడం, వర్షాలు పడడంతో ఆపేస్తుండడంతో పూర్తిస్థాయిలో పనులు చేయడం సాధ్యపడడం లేదు. ప్రభుత్వ యంత్రాంగం మూడు నెలలుగా ఎన్నికల నిర్వహణలో తలమునకలై ఉండడంతో సాగునీరు, వ్యవసాయం వంటి అంశాలపై పెద్దగా దృష్టిసారించలేకపోయారు. ఇప్పటికైనా ఈ రంగాలపై సమీక్షలు నిర్వహించి అవసరమైన నిధులు విడుదల చేస్తే రైతులకు కొంతమేరకైనా మేలు చేకూరుతుంది.హిరమండలం గొట్టాబ్యారేజీ ద్వారా వంశధార కుడి, ఎడమ కాలువల కింద 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఇందులో ఎడమ కాలువ ద్వారా 1.70 లక్షల ఎకరాలు, కుడి కాలువ ద్వారా 80 వేల ఎకరాలకు నీటిని అందించాల్సి ఉంది. కాలువల పరిస్థితి దయనీయంగా ఉండడంతో నిర్ధేశించిన ఆయకట్టుకు నీరందడం లేదు. ముఖ్యంగా శివారు భూములకు నీరందని పరిస్థితి ఏటా పునరావృతమవుతోంది. సాగునీటి కాలువలు చాలా బలహీనంగా ఉండడం, కాలువల్లో పెద్దఎత్తున గుర్రపుడెక్క పేరుకుపోవడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. వంశధార ఎడమ కాలువ సామర్థ్యం 2,450 క్యూసెక్కులు కాగా, కాలువ గట్లు బలహీనంగా ఉండడంతో 1600 క్యూసెక్కులకు మించి నీరు విడిచి పెట్టలేని పరిస్థితి నెలకొంది. కుడి కాలువ సామర్థ్యం 800 క్యూసెక్కులు కాగా 500 క్యూసెక్కులకు మించి నీరు విడిచిపెట్టలేని పరిస్థితి నెలకొంది.సొంత ఖర్చులతో గుర్రపుడెక్క తొలగింపుపంట కాలువల్లో గుర్రపుడెక్క, పూడికతీత ఎక్కువ పేరుకుపోతుండడంతో పొలాలకు నీటి ఇబ్బందులు పునరావృతమవుతూనే ఉంది. పనులు ఆలస్యంగా మొదలు పెడుతుండడం, సరిపోయినంత నిధులు విడుదల చేయకపోవడంతో కొన్నిచోట్ల రైతులే తమ సొంత డబ్బులతో కాలువల్లో గుర్రపుడెక్క, పూడిక తొలగించుకున్నారు. గతేడాది జూలై 29న పోలాకి గ్రామానికి చెందిన పది మంది రైతులు గుర్రపుడెక్క, పూడిక తొలగించాలని వంశధార కాలువలో దిగారు. కాలువల్లో నీరు ప్రవహించడంతో ముప్పిడి శాంతారావు అనే రైతు గల్లంతయ్యాడు.జిల్లా నిధుల నుంచే గుర్రపుడెక్క తొలగింపు పనులుకాలువల్లో పెద్దఎత్తున గుర్రపుడెక్క పేరుకుపోవడంతో నీరు సాఫీగా ప్రవహించని పరిస్థితి ఏటా తలెత్తుతోంది. ప్రభుత్వానికి నిధులు అడుగుతున్నా విడుదల చేయకపోవడంతో, జిల్లా అధికారులు పలురకాల ఫండ్స్‌ నుంచి అత్యవసరంగా నిధులు మంజూరు చేస్తున్నారు. గుర్రపుడెక్క తొలగింపునకు గతేడాది జూలైలో రూ.50 లక్షలు ఇచ్చారు. 2022 జూలైలో రూ.44 లక్షలు, ఆగస్టులో రూ.19.5 లక్షలు కేటాయించారు. 2021లో రూ.15 లక్షలు విడుదల చేశారు. ఈ ఏడాదీ నిధులు కేటాయించి పనులు వేగంగా పూర్తి చేయగలిగితే ఖరీఫ్‌కు రైతుల కష్టాలు తీరనున్నాయి.ప్రతిపాదనలు ఇలా…వంశధారలో కుడి, ఎడమ కాలువల్లో గుర్రపుడెక్క, పూడికతీత పనులకు రూ.95 లక్షలు అవసరమని వంశధార అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ఏడాదీ నిధులు విడుదలవుతాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో త్వరితగతిన పనులు చేపట్టాలంటే జిల్లా ఉన్నతాధికారులే నిధుల విడుదలకు చొరవ చూపాల్సి ఉంది.

గుర్రపుడెక్క తొలగింపుపై కార్యాచరణ

గుర్రపుడెక్క, పూడిక తొలగింపునకు అవసరమైన కార్యాచరణ ప్రారంభించాం. ప్రభుత్వానికి రూ.95 లక్షలతో ప్రతిపాదనలు పంపాం. నిధుల విడుదలైన వెంటనే పనులు ప్రారంభిస్తాం. ఈ ఏడాది రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. శివారు భూములకు నీరందేలా చర్యలు తీసుకుంటాం.

– డోల తిరుమలరావు, వంశధార సర్కిల్‌ పర్యవేక్షక ఇంజినీరు 

➡️