రోజుకు 60 గ్రామాల్లో పరీక్షలు
ఉపాధి హామీ నిధులతో గోశాలల నిర్మాణం
పశుసంవర్థక శాఖ జెడి కె.రాజగోపాల్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
జిల్లాలో పాడి రైతులకు మేలు చేకూర్చే విధంగా ఈనెల 20 నుంచి 31వ తేదీ వరకు గ్రామాల్లో పశువైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు పశుసంవర్థకశాఖ సంయుక్త సంచాలకులు కంచరాన రాజగోపాల్ తెలిపారు. ప్రతిరోజూ 60 గ్రామాలను ఎంపిక చేసుకుని మండలానికి రెండు గ్రామాలు చొప్పున వైద్య శిబిరాలను నిర్వహిస్తామన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సాహం అందిస్తోందన్నారు. గోశాలల నిర్మాణానికి ప్రభుత్వం ఉపాధి హామీ నిధులు కేటాయించిందని తెలిపారు. ఇప్పటికే కొన్ని గోశాలలను పూర్తి చేసి ప్రారంభించినట్లు చెప్పారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నామన్నారు. గొర్రెలు, మేకల పెంపకందారులకు ప్రయోజనం చేకూరుస్తున్నట్లు తెలిపారు. పలు అంశాలను ‘ప్రజాశక్తి’ ముఖాముఖిలో వెల్లడించారు.పాడి రైతులకు పశుసంవర్థక శాఖ ద్వారా ఎలాంటి ప్రయోజనాలను అందిస్తోంది?జిల్లాలో పశుసంపద ఆరోగ్యంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వాతావరణంలో వస్తున్న మార్పులు, దోమల బెడద, అపారిశుధ్యం వల్ల పశువుల్లో వ్యాధులు సంక్రమిస్తుంటాయి. అందువల్ల గ్రామాల్లో క్షేత్రస్థాయిలో రైతుల్లో అవగహన కల్పించడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా ఈనెల 20 నుంచి జిల్లావ్యాప్తంగా పశు వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాల్లో గర్భకోశ వ్యాధులు, నట్టల నివారణ, వ్యాధి నిరోధక టీకాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శాస్త్రీయ యాజమాన్యంపై రైతులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ఈనెల 31వ తేదీ వరకు నిర్వహించే శిబిరాల్లో ప్రతిరోజూ మండలానికి రెండు గ్రామాలు చొప్పున రోజుకు 60 గ్రామాలను ఎంపిక చేయడైంది. ఈ శిబిరాల్లో పెద్దఎత్తున రైతులు పాల్గొనేందుకు వీలుగా విస్తృత ప్రచారం చేస్తున్నాం.జిల్లాలో పశువుల గణాంకాలు ఎలా ఉన్నాయి? జిల్లాలో చేపట్టిన పశుగణన ఆధారంగా ఆవులు 4.56 లక్షలు, గేదెలు 0.40 లక్షలు, అందులో పాడి పశువులు 3,75,345, లేగ దూడలు 45,914, గొర్రెలు 6.23 లక్షలు, మేకలు 2.77 లక్షలు, కోళ్లు 13.19 లక్షలు, పందులు 3092 రైతుల పెంపకంలో ఉన్నాయి. వాటి పెంపకానికి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు వివరిస్తున్నాం. జిల్లాలో 154 పశువైద్యశాలల ద్వారా వాటికి పశువైద్య సేవలు అందిస్తున్నాం. దీనికితోడు 12 రోజుల పాటు నిర్వహించే పశువైద్య శిబిరాల్లో వాటన్నింటికి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ శిబిరాల్లో పశువైద్యాధికారి, పారా వెటర్నరీ సిబ్బంది, గోపాలమిత్ర, పశుసంవర్థక శాఖ ఎడి, సహాయకులు బృందంగా ఏర్పడి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత వైద్యాన్ని అందించడంతో పాటు ఉచితంగా మందులు అందజేస్తాం. క్రమం తప్పకుండా రైతులు వాటిని వాడే విధంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉంటుంది.గోశాలల నిర్మాణం ఎలా సాగుతోంది? జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీ నిధులతో పెద్దఎత్తున గోశాలల నిర్మాణం జరుగుతోంది. జిల్లాలో ఇప్పటికే సుమారు 900 గోశాలల నిర్మాణం పూర్తి చేయడమైంది. ప్రభుత్వ నిబంధనల మేరకు నేరుగా రైతులకే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నాం. డ్వామా పర్యవేక్షణలో నిధులు మంజూరు చేయడం జరుగుతోంది. రైతులకు ఈ పథకం ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తోంది. నిర్మాణం పూర్తయిన గోశాలలను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తూ రైతులకు అందజేస్తున్నారు.పశువుల బీమా అమలు ఎలా ఉంది?జిల్లాలో పశువుల పెంపకందారులు బీమా ప్రీమియం చెల్లించడం ద్వారా అనుకోని సంఘటన ఎదురైనప్పుడు పరిహారం పొందడానికి వీలుంటుంది. బీమాపై అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంగా ఉంటూ అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు నష్టపోతున్నారు. అందువల్ల ప్రతి రైతు పంటల బీమా మాదిరిగా పశువులకు బీమా చేయించుకోవాలి. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.