వి.జి.కె మూర్తి ఇక లేరు

సిపిఎం సీనియర్‌

వి.జి.కె మూర్తి భౌతికకాయానికి నివాళ్లర్పిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు తదితరులు

  • తుది శ్వాస విడిచే వరకు ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యం
  • సిపిఎం, ప్రజాసంఘాల్లో అనేక బాధ్యతలు నిర్వర్తించిన మూర్తి
  • పలువురు సంతాపం
  • నేడు సంతాప సభ
  • రిమ్స్‌కు భౌతికకాయం అప్పగింత

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

సిపిఎం సీనియర్‌ నేత వి.జి.కె మూర్తి (74) గురువారం మృతి చెందారు. ఈనెల 15వ తేదీన తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబసభ్యులు శ్రీకాకుళం నగరంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మరణించారు. ఆయన పార్టీ, ప్రజాసంఘాల్లో అనేక బాధ్యతలను నిర్వర్తించారు. 1972లో ఆయన ఎల్‌ఐసిలో ఉద్యోగిగా చేరారు. ఎల్‌ఐసి ఎంప్లాయీస్‌ యూనియన్‌ శ్రీకాకుళం బ్రాంచి అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేసి ఉద్యోగుల హక్కులు, ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలపై పోరాడారు. 1985లో పార్టీ సభ్యునిగా చేరారు. 1992లో సిఐటియు జిల్లా ప్రథమ అధ్యక్షులుగా పనిచేశారు. 1991 నుంచి 1994 వరకు పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లాలో సిఐటియు నిర్మాణంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఆయన ఎల్‌ఐసిలో ఉద్యోగం చేస్తూ వచ్చిన వేతనంలో చాలావరకు ప్రజా ఉద్యమాలకు ఖర్చు చేశారు. 1997లో పైడిభీమవరం పారిశ్రామిక ప్రాంతంలో శ్యామ్‌క్రగ్‌ పిస్టన్స్‌ అండ్‌ రింగ్స్‌ పరిశ్రమలో సిఐటియు అనుబంధ యూనియన్‌ ఏర్పాటు చేయడానికి, తర్వాత ఎనిమిది నెలల పాటు కార్మికులతో సుదీర్ఘ సమ్మె నడిపించడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. 1998లో అప్పటి కలెక్టర్‌ ఎస్‌.ఇ శేఖరబాబుకు కార్మికులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు వివరించి వెంటనే జోక్యం చేసుకొని సమస్య పరిష్కారానికి చేసిన కృషి కార్మికులు ఇప్పటికీ మరిచిపోలేనిది. వెంకట బాలాజీ, నీలం జూట్‌ కార్మికుల సుదీర్ఘ పోరాటాల్లో కీలకపాత్ర పోషించారు. ఆయన మొదటి భార్య లక్ష్మి 1991లో మృతి చెందారు. తర్వాత ప్రసూనాంబను 1993లో వివాహం చేసుకున్నారు. ఆమె 2017లో మరణించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు భారతి, స్రవంతి, కుమారుడు శ్రీనివాస్‌ కుమార్‌ ఉన్నారు. కుమార్తె భారతి, కుమారునికి ఆదర్శ వివాహం చేశారు. ఆయన మరణించే నాటికి గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్షునిగా, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

పలువురు సంతాపం

వి.జి.కె మూర్తి మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.లోకనాధం, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.కె.ఎస్‌ కుమార్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, కె.మోహనరావు, నాయకులు కె.శ్రీనివాసు, కె.నాగమణి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజ శర్మ పార్ధివదేహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎన్‌జిఒ అసోసియేషన్‌ పూర్వ ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తం నాయుడు, యుటిఎఫ్‌ నాయకులు, పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కె.విజయగౌరి, పోస్టల్‌ యూనియన్‌ నాయకులు గణపతి, జ్యోతిశ్వరరావు, జెవివి రాష్ట్ర కార్యదర్శి మురళీధర్‌, ముస్లిం మత పెద్ద సలీం భౌతికాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. ఎన్‌టిఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి జామి భీమశంకరరావు, పాలిశెట్టి మల్లిబాబు, కథానిలయం కార్యదర్శి దాసరి రామచంద్రరావు, రచయితలు అట్టాడ అప్పలనాయుడు, చింతాడ తిరుమలరావు, కంచరాన భుజంగరావు, అరసం జిల్లా అధ్యక్షులు నల్లి ధర్మారావు తదితరులు నివాళ్లర్పించిన వారిలో ఉన్నారు. గరిమెళ్ల మెమోరియల్‌ ట్రస్టు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ఎ.ఎన్‌ భుక్త, బాడాన రాజు సంతాపం తెలిపారు.వి.జి.కె మూర్తి మరణం కార్మిక, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎం.ప్రభాకరరావు, కోశాధికారి పి.సుధాకరరావు అన్నారు. భౌతికకాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వి.జి.కె మృతిపై ప్రజాశక్తి విశాఖ, శ్రీకాకుళం ఎడిషన్ల మేనేజర్లు ఎం.వెంకటేశ్వరరావు, పి.కామినాయుడు శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రిమ్స్‌కు భౌతికకాయం అప్పగింత

తాను చనిపోయినా తన కళ్లు మరో ఇద్దరికి వెలుగునివ్వాలని ఆయన రెండు కళ్లను రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న మగటపల్లి కళ్యాణ్‌ నేత్ర సేకరణ కేంద్రానికి దానం చేశారు. కుటుంబసభ్యులు శ్రీనివాస్‌, స్రవంతి నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావుతో పాటు టెక్నీషియన్‌ పి.సుజాత, సహాయకురాలు అనిత చేరుకుని కార్నియాలను సేకరించారు. వాటిని విశాఖపట్నంలోని ఎల్‌.వి ప్రసాద్‌ నేత్ర వైద్యాలయానికి పంపించారు. మూర్తి కుటుంబ సభ్యులను రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహనరావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి దుర్గా శ్రీనివాస్‌ అభినందించారు. మరణాంతరం తన భౌతికకాయాన్ని బోధన, పరిశోధన నిమిత్తం రిమ్స్‌కు ఇవ్వాలన్న ఆయన కోరిక మేరకు కుటుంబసభ్యులు శుక్రవారం అప్పగించనున్నారు. మరణానంతరం తన భౌతికకాయాన్ని బోధన, పరిశోధన నిమిత్తం రిమ్స్‌కు ఇవ్వాలన్న ఆయన కోరిక మేరకు కుటుంబసభ్యులు శుక్రవారం అప్పగించనున్నారు.

నేడు సంతాప సభ

ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికాయాన్ని కత్తెర వీధిలోని నివాసానికి తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆయన నివాసం వద్ద సంతాప సభ నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ్నుంచి రిమ్స్‌ కళాశాల వరకు ప్రదర్శనగా వెళ్లి భౌతికకాయాన్ని అప్పగించనున్నారు.

➡️