మాట్లాడుతున్న యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు
యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి- మందస
ఉపాధ్యాయ వ్యవస్థలో పేరుకుపోయి ఉన్న అనేక అపరిష్కృత సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తి ఉత్తరాంధ్ర పిడిఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి అని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు అన్నారు. మందస మండల యుటిఎఫ్‌శాఖ ఆధ్వర్యాన మండలంలోని హరిపురంలో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన విద్యా విధానంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారని అన్నారు. పిల్లలు చదువుకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఉపాధ్యాయులపై పని భారం, ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలతో పాటు ఇతర అనేక సమస్యలపై పోరాడిన అనుభవం విజయగౌరికి ఉందన్నారు. మండలిలో ఉపాధ్యాయుల సమస్యలపై గళమెత్తుతారని అన్నారు. రాష్ట్ర కార్యదర్శులు ఎస్.కిషోర్‌కుమార్, జయచంద్రారెడ్డి మాట్లాడుతూ చట్టసభలో ప్రభుత్వాన్ని నిలదీసి విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేసే వారినే ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని తెలియజేశారు. అటువంటి పోరాట పటిమ కలిగినటువంటి ఎమ్మెల్సీలు పిడిఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమే అని అన్నారు. ఉత్తరాంధ్ర నుంచి మొదటిసారిగా పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి కోరెడ్ల విజయగౌరికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గున్న రమేష్, రాష్ట్ర కౌన్సిలర్ గుంట కోదండరావు, జిల్లా అకడమిక్ సెల్ కో-కన్వీనర్ కంచరాన మాధవరావు, మండల ప్రధాన కార్యదర్శి దాసరి ఈశ్వరరావు, సహాధ్యక్షులు జన్ని సోమేశ్వరరావు, జిల్లా కౌన్సిలర్లు తరిణి సోమేశ్వరరావు, ఆనల అప్పారావు, కంచరాన లేపాక్షి, నందిగాం అశోక్ పాల్గొన్నారు.