ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతున్న కిషోర్‌కుమార్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకునేందుకు ప్రజలు ఉద్యమించాల్సిన అవసరముందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.చందు, బి.హరీష్ అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ ఆపాలని, సెయిల్‌లో విలీనం చేసి పరిరక్షించాలని కోరుతూ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక ఏడురోడ్ల కూడలి వద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్షలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మబలిదానాలు, వామపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేల రాజీనామాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే దేశవ్యాప్తంగా యువతకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. రాష్ట్రంలోనే ఏకైక భారీ పరిశ్రమను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. ఇటువంటి నిర్ణయం వల్ల నిరుద్యోగం మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాక ముందు బిజెపి ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికిందని, ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ అంశాన్ని పక్కనపెట్టి ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తోందన్నారు. నిరాహార దీక్షలకు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు నల్లి ధర్మారావు, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సంపతిరావు కిషోర్‌కుమార్ సంఘీభావం తెలిపారు. నిరాహార దీక్షలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్.రాజు, జిల్లా సహాయ కార్యదర్శి ఎం.సంతోష్, గర్ల్స్ కన్వీనర్ పవిత్ర, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.