మాట్లాడుతున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
స్వర్ణాంధ్ర విజన్ రూపకల్పనలో ప్రజలు భాగస్వాములై తమ అభిప్రాయాలను తెలపాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కోరారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికను రూపొందించడంలో రాష్ట్రంలోనే జిల్లా తొలి స్థానంలో నిలిచిందన్నారు. ఇంకా సమయం ఉన్నందున స్వర్ణాంధ్ర సాధనకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాన్నారు. రెవెన్యూ, ప్రీహోల్డ్ సర్వే, కోర్టు కేసులు, రీ ఓపెన్ గ్రీవెన్స్, ఓటర్ల జాబితా రూపకల్పన, స్వచ్చతా హీ సేవ, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, ఉపాధి హామీ పనులు, వంద రోజుల ప్రగతి తదితర అంశాలపై జిల్లా అధికారులు, ఆర్‌డిఒలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఒలు, తహశీల్దార్లతో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి కలెక్టరేట్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధికి అవసరమైన వనరులున్నాయని, వాటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మీకోసంలో వచ్చే ఫిర్యాదులను సరైన కారణాలు లేకుండా తిరస్కరించవద్దని చెప్పారు. రీ ఓపెన్ చేసిన అర్జీలను నిశితంగా పరిశీలించి అవసరమైన సందర్భంలో ఆయా అర్జీదారులతో వ్యక్తిగతంగా మాట్లాడి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఓటరు జాబితాకు సంబంధించిన హౌస్ హోల్డ్ తనిఖీలను ఎన్నికల సంఘం నిర్ణయించిన షెడ్యూల్ మేరకు పూర్తి చేయాలన్నారు. మన ఇళ్లు-మన గౌరవం హౌసింగ్ కార్యక్రమంలో ప్రతి వారం కచ్చితమైన పురోగతి ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, ఆర్‌డిఒలు సుదర్శనదొర, భరత్ నాయక్, సిపిఒ ప్రసన్నలక్ష్మి, ఐసిడిఎస్ పీడీ బి.శాంతిశ్రీ, గ్రామ సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.