‘వంశధార’ రెండో దశ పూర్తి చేస్తాం

జిల్లా జీవనాడి

సిఆర్‌ఎం పట్నాయక్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు

  • ఎడమ కాలువను ఆధునీకరిస్తాం
  • కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

జిల్లా జీవనాడి వంశధార ప్రాజెక్టు రెండో దశను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పూర్తి చేస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. నగరంలోని వంశధార కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వంశధార ప్రాజెక్టు రూపశిల్పి కీ.శే సిఆర్‌ఎం పట్నాయక్‌, మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువను ఆధునీకరిస్తామ న్నారు. త్వరలోనే నాగావళి-వంశధార నదుల అనుసంధానాన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. తాను పార్లమెంట్‌ సభ్యునిగా పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించానని, వీటిని పూర్తి చేసే బాధ్యత తనపై ఉందన్నారు. ఇందుకోసం ప్రపంచబ్యాంకు నిధులైనా, కేంద్రం నిధులైనా తీసుకొస్తానన్నారు. నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశాతో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఒడిశా ముఖ్యమంత్రిని కలిసేలా ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందుల్లేకుండా పూర్తి చేస్తామని హామీనిచ్చారు. మన జిల్లాలో నాగావళి, వంశధార వంటి నదులున్నా, ఇంకా వెనుకబడే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమర్థవంతమైన నీటిపారు దల వల్లే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. సిఆర్‌ఎం పట్నాయక్‌ లేకపోతే వంశధార ప్రాజెక్టు అనేది లేదన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారన్నారు. ఒడిశాతో ఉన్న అభ్యంతరాలను తొలగించి త్వరలోనే నేరడి బ్యారేజీ నిర్మాణాన్ని మొదలుపెడతామని, జిల్లాను అపర అన్నపూర్ణగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌, నార్త్‌ కోస్ట్‌ సిఇ సుగుణాకరరావు, వంశధార ఎస్‌ఇ రాంబాబు, ఎపిటిపిసి చైర్మన్‌ వజ్జ బాబూరావు, డిసిసిబి మాజీ చైర్మన్‌ డోల జగన్‌, ఒడిశా విశ్రాంత చీఫ్‌ ఇంజినీరు సి.వి ప్రసాద్‌, సిఆర్‌ఎం పట్నాయక్‌ కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

➡️