మాట్లాడుతున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
- కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
ప్రజాశక్తి – వజ్రపుకొత్తూరు
అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌లో అగ్రస్థానంలో నిలబెడతామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మండలంలోని మంచినీళ్లపేటలో ఎమ్మెల్యే గౌతు శిరీష అధ్యక్షతన గురువారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంధకారంలోకి వెళ్లిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం తిరిగి వెలుగుల్లోకి తెచ్చిందని, వంద రోజుల పాలనలో ఎన్నో ఘనతలు సాధించామన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. మూలపేట పోర్టును ఏడాదిలో పూర్తి చేసి మత్స్యకారులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీనిచ్చారు. నౌపడ-పూండీ రహదారిని అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు, కొండలు దోపిడీ, స్థలాలు కబ్జా తప్ప చేసిన అభివృద్ధి ఏదీ లేదని విమర్శించారు. వెంటిలేటర్‌పై రాష్ట్ర ప్రభుత్వంగత ప్రభుత్వ అప్పులతో రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందని, కేంద్రం సహకారం లేకపోతే మనుగడ కష్టమని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పదవులు శాశ్వతం కాదని, చేసిన మంచి పనులే చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఉద్దానం ప్రాంతానికి ప్రత్యేకంగా మళ్లీ ఉద్యానశాఖ ఎడి కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిష్ ల్యాండ్ సెంటర్‌ను పూర్తి చేస్తామని హామీనిచ్చారు. ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ మత్స్యకారుల కోసం ఇక్కడే ఫిషింగ్ జెట్టీ త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుళ్ల చిన్నారావు, టిడిపి నాయకులు పీరుకట్ల విఠల్, జనసేన నాయకులు దుర్గారావు, మాజీ ఎంపిపి గొరకల వసంతరావు, టిడిపి మండల అధ్యక్షులు సూరాడ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.