జీడిపిక్కలకు మద్దతు ధర కల్పిస్తాం

డిపిక్కలకు

మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

  • ఎమ్మెల్యే గౌతు శిరీష

ప్రజాశక్తి – పలాస

జీడిపిక్కలకు మద్దతు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. కాశీబుగ్గలోని ఒక కళ్యాణ మండపంలో ఉద్యానశాఖ ఆధ్వర్యాన జీడి, కొబ్బరి పంటలపై రైతులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, అచ్చెన్నాయుడు సహకారంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి జీడి, కొబ్బరి రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పలాసలో జీడి, సోంపేటలో కొబ్బరి బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. జీడి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. అధికారులు ఇచ్చిన శిక్షణతో సాంకేతిక పరిజ్ఞానం జోడించి పంటలపై మెళకువలు నేర్చుకోవాలని రైతులకు సూచించారు. జీడి, కొబ్బరి రైతులను ఆదుకునే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. జీడి పంటలపై అవగాహన కల్పించేందుకు ఉద్యానవన శాఖ అధికారులు పలాస, వజ్రపుకొత్తూరు, మండలాల్లో మరో రెండు రోజులు పర్యటించి పంటలపై తగు సూచనలు ఇవ్వనున్నారని తెలిపారు. జీడి రైతులతో పాటు వ్యాపారుల కూడా ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సదస్సులో జిల్లా ఉద్యానశాఖ అధికారి ఆర్‌.వి.వి ప్రసాద్‌, పలాస పిసిఎంఎ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.శ్రీనివాసరావు, టంకాల రవిశంకర్‌ గుప్త, వ్యవసాయ శాస్త్రవేత్తలు కె.ఉమామహేశ్వరరావు, జి.సావిత్రి, హరికుమార్‌, ఎస్‌.అనూష, ఉద్యానశాఖ అధికారులు కె.శైలజ, శంకర్‌ దాస్‌, సునీత తదితరులు పాల్గొన్నారు.

➡️