ఏమైపోయారు వాళ్లంతా?

మీకు మేమున్నాం.. మీ సమస్య

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

మీకు మేమున్నాం.. మీ సమస్య ఏంటో చెప్పండి క్షణాల్లో పరిష్కరిస్తాం.. ఓటరు వెళ్లి అడిగిందే తడవు.. ఏ పనైనా రోజుల్లో జరిగి పోయేది. పోలింగ్‌ ముందు వరకూ అదే పరిస్థితి ఉండేది. తర్వాత సీన్‌ మారింది. ఇప్పుడు నాయకులు కనిపించడమే మానేశారు. అభ్యర్థుల క్యాంపు కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు బోసిపోయాయి. పోలింగ్‌ ముగిసిన నాటి నుంచి నాయకులు బయటకే రావడం లేదు. కొంతమంది విహార యాత్రలకు వెళ్లగా, కొంతమంది స్థానికంగా ఉన్నవారు సైతం ఇళ్లకే పరిమితమవుతున్నారు. నాయకులు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో వీళ్లంతా ఏమైపోయారో అని అంతా అనుకుంటున్నారు. పోలింగ్‌ సరళి తమకంటే తమకే అనుకూలంగా ఉందంటూ ఇరు పార్టీలు తమకనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. జిల్లాలో అత్యధిక స్థానాల్లో తామే గెలుస్తామని, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వమే మళ్లీ ఏర్పాటవుతుందని వైసిపి ప్రజాప్రతినిధులు ప్రకటనలు గుప్పించారు. జిల్లాలోని అన్ని సీట్లలో టిడిపి జెండా ఎగురవేయబోతున్నామని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాబోతుందంటూ టిడిపి నాయకులు జోస్యం చెప్పారు. ఇప్పటికీ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్న అభ్యర్థులు తమకు వచ్చే ఓట్లపై ఎడతెరిపిలేని చర్చలు జరుపుతున్నారు. పోలింగ్‌ బూత్‌ల వారిగా లెక్కలు కడుతూ కుస్తీలు పడుతున్నారు. లెక్కలన్నీ తేలాక గెలుపుపై ఒక అంచనాకు వస్తున్నారు. బొటాబొటీ మెజార్టీతో నైనా గట్టెక్కుతామని కొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయినా మనసులో ఏదో మూల రేకెత్తిన ఆందోళన వారిని స్థిమితంగా ఉండనీయడం లేదు. జూన్‌ నాలుగో తేదీ ఎప్పుడు వస్తుందా? అని క్షణమొక యుగంలా గడుపుతున్నారు. ప్రజా సమస్యల జోలికి వెళ్లడం లేదు. ఓట్ల కోసం తమ చుట్టూ తిరిగిన అభ్యర్థులు పోలింగ్‌ తర్వాత కనిపించకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక జనం అయోమయంలో ఉన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు గతంలో స్పందన కార్యక్రమం నిర్వహించేవారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత వినతుల స్వీకరణను ఆపేశారు. మరోవైపు నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో తమ పాత్ర ఏమీ లేనట్లుగా ప్రజాప్రతినిధులు భావిస్తున్నట్లుగా ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులే చూసుకోవాలి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా కొన్ని పరిమితులకు లోబడి పాలన కొనసాగించే అవకాశం ఉంది. విధాన నిర్ణయాలు, ఓటర్లను ప్రభావిత చేసే నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు పాటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించే అవకాశం ఉన్నా తమకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆర్డినెన్స్‌ల జారీ, ఉన్నతాధికారుల బదిలీలు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ వంటి అంశాల జోలికి వెళ్లకుండా రోజు వారీ ప్రభుత్వ కార్యకలాపాలను చేసుకునే వెసులుబాబు పాలకులకు ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తీర్చవచ్చు. ఎన్నికలు అయిపోవడంతో ప్రజల సమస్యలు మనకెందుకు అనే తీరుతో ప్రజాప్రతినిధులు ఎవరి సొంత పనులు వాళ్లు చూసుకుంటున్నారు. అధికార యంత్రాంగమూ ప్రజా సమస్యలపై సమీక్షలు చేయని పరిస్థితి నెలకొంది. జూన్‌ నాలుగో తేదీన నిర్వహించనున్న కౌంటింగ్‌పైనే ప్రధానంగా దృష్టి సారించారు. రోజంతా ఓట్ల లెక్కింపుపై సమీక్షలు, స్ట్రాంగ్‌రూమ్‌ల పరిశీలన వంటి కార్యక్రమాలతోనే నెట్టుకొస్తున్నారు. నామినేషన్ల స్వీకరణకు ముందు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షలు జరుపుతూనే మరోవైపు తాగునీరు, ఉపాధి హామీ తదితర ప్రజా సమస్యలపై అధికారులతో సమీక్షలూ నిర్వహించారు. పోలింగ్‌ తర్వాత మాత్రం కేవలం ఓట్ల లెక్కింపు అంశాలకే జిల్లా యంత్రాంగం పరిమితమయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరో వారం రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ మొదలవుతుండటంతో రైతులు విత్తనాలను సమకూర్చుకునే పనిలో ఉన్నారు. గతేడాది వరి విస్తీర్ణం ప్రాతిపదికన కాకుండా రాజకీయ పార్టీ నాయకుల సిఫార్సులకు అనుగుణంగా విత్తన కేటాయింపులు జరిపారన్న విమర్శలు ఉన్నాయి. కౌలు రైతులకు గుర్తింపు కార్డుల ప్రక్రియను ఇప్పుడు ప్రారంభిస్తేనే వారికి జూలై నాటికయినా పంట సాగు హక్కు పత్రాలు అందే పరిస్థితి ఉంది. వంశధార కాలువల్లో పూడికతీత పనులు సరకమంగా జరగకపోవడంతో గత ఖరీఫ్‌లో శివారు భూములకు సాగునీరందక పంటలు ఎండిపోయిన పరిస్థితిని చూశాం. ఈ నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశాలపై జిల్లా యంత్రాంగమే చొరవ చూపి ప్రత్యేక సమీక్షలు జరపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

➡️