పరిహారం పడేదెప్పుడు…?

వేట నిషేధ భృతి
  • జూన్‌ 15న చేపల వేట నిషేధం ఎత్తివేత
  • నేటికీ జమ కాని డబ్బులు
  • రీ సర్వే చేయాలంటూ ప్రభుత్వం ఆదేశం
  • పరిహారం మరింత జాప్యమయ్యే అవకాశం

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

వేట నిషేధ భృతి కోసం మత్స్యకారులు మరికొద్ది రోజులు ఆగాల్సిన పరిస్థితి తలెత్తింది. పరిహారం జాబితాపై మరోసారి సర్వే చేసి 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాల నుంచి నివేదికలు ప్రభుత్వానికి చేరడం, వాటికి ఆమోదం తెలపడం తదితర ప్రక్రియలు పూర్తికావడానికి మరో పది, 15 రోజులు పట్టే అవకాశం ఉంది. ఏవిధంగా చూసుకున్నా ఆగస్టు నెలాఖరుకు మత్స్యకారులు నిరీక్షించక తప్పేలా లేదు. ఎన్నికల కోడ్‌ ఫలితంగా లబ్ధిదారుల ఎంపిక సర్వేలో ఈ ఏడాది కొంత జాప్యం చోటుచేసుకుంది. మత్స్యకారులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతులు తీసుకుని ఈ ఏడాది మే రెండో తేదీన సర్వే నిర్వహించింది. మే మూడు, నాలుగు తేదీల్లో డేటా వెరిఫికేషన్‌, నమోదు చేశారు. మే ఆరు నుంచి పదో తేదీ వరకు లబ్ధిదారుల వివరాలను నవశకం పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు. మే 14న సచివాలయాల్లో జాబితాలను ప్రదర్శించారు. మే 15 నుంచి 17వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించారు. మే 18, 19 అభ్యంతరాలను పరిష్కరించారు. మే 22న లబ్ధిదారుల వడపోత, జాబితా తయారీ చేపట్టారు. గత నెల రెండో తేదీ నాటికి ప్రాథమిక జాబితా పూర్తయింది. ఆ జాబితా ప్రకారం జిల్లాలో 15,375 మంది మత్స్యకారులను సర్వే చేశారు. వీరిలో ప్రాథమికంగా 12,952 మందిని అర్హులుగా గుర్తించారు. మత్స్యకార భరోసాకు గత ప్రభుత్వం విధించిన రకరకాల కారణాలతో 2,423 మందిని అనర్హులుగా పెండింగ్‌లో ఉంచారు. వీటిని కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత పరిహారం చెల్లింపుపై ఒక స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. పరిహారం చెల్లింపునకు డీజిల్‌ వాడకం మెలికమత్స్యకార భరోసా చెల్లింపునకు ప్రభుత్వం ఈసారి కొత్తగా డీజిల్‌ వాడకాన్ని మెలిక పెట్టింది. మత్స్యకారుల బోట్లకు ప్రభుత్వం ఏడాదికి లీటరుకు రూ.9 చొప్పున సబ్సిడీతో 300 లీటర్ల డీజిల్‌ను అందిస్తోంది. కనీసం వంద లీటర్లనూ వినియోగించని వారిని అనర్హులు జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. పెండింగ్‌ జాబితాలో ఉన్న 2,423 మందిలో సుమారు 1890 మందిని ఈ నిబంధనతోనే అనర్హులుగా మారినట్లు తెలుస్తోంది. గతేడాది ఈ నిబంధన ఉన్నా మొదటిసారి మినహాయింపు ఇచ్చారు. ఈ సంవత్సరం దాన్ని అమలు చేయాలని నిర్ణయించి అందుకనుగుణంగా జాబితాను తయారు చేశారు. వాస్తవానికి ఇందులో ప్రభుత్వ తప్పిదమే కనిపిస్తోంది. మత్స్యకారులకు సబ్సిడీపై డీజిల్‌ అందించేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా పెట్రోల్‌ బంకులను గుర్తించింది. ప్రభుత్వం కొందరు బంకు యజమానులకు సబ్సిడీ డబ్బులు సకాలంలో విడుదల చేయకపోవడం, టెక్నికల్‌ కారణాలతో డీలర్లు మత్స్యకారులకు డీజిల్‌ అందించేందుకు నిరాకరించారు. దీంతో వారు వేరే బంకుల్లో నుంచి కొనుగోలు చేసి చేపల వేటకు వెళ్లారు. ప్రభుత్వ తప్పిదంతో తమను అనర్హులుగా చేయడమేమిటని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు.నిబంధనలతో 533 మంది అనర్హులుమత్స్యకార భరోసాకు ఐదేళ్లుగా వైసిపి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలనే ఎన్నికల సమయంలో ఉన్న ప్రభుత్వమూ అమలు చేసింది. పరిహారం కోసం 18 నుంచి 60 ఏళ్ల వయసు, కుటుంబంలో ఒకరికి మాత్రమే సాయం, మత్స్యకార పెన్షన్‌ పొందుతున్న వారిని వడపోశారు. పల్లం భూమి మూడు ఎకరాలు గానీ మెట్టు పది ఎకరాలకు మించి ఉన్న వారిని, నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్న వారిని కుటుంబ విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లకు మించి వాడిన వారిని అనర్హుల జాబితాలో చేర్చారు. కుటుంబంలో ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులు ఉంటే వారిని అనర్హులని స్పష్టం చేసింది. కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తుంటే వారికీ పథకం వర్తింపజేయలేదు. ఈ నిబంధనలతో 533 మందిని పక్కనపెట్టారు. వేట నిషేధ పరిహారానికి నిబంధనలు తొలగించి చేపల వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారునికీ కొత్త ప్రభుత్వం పరిహారం అందించాలని కోరుతున్నారు.

➡️