ఆఫ్‌షోర్‌ను ఎప్పుడు పూర్తి చేస్తారు?

ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు

  • బడ్జెట్‌లో మొక్కుబడి కేటాయింపులు
  • జిల్లాపై నిర్లక్ష్యానికి ఇదో నిదర్శనం
  • సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు

ప్రజాశక్తి – నందిగాం

ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ను ఎప్పుడు పూర్తి చేస్తారని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా చైతన్య యాత్రల్లో భాగంగా మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ 2007లో ప్రారంభించి నేటికి 18 ఏళ్లు పూర్తయినా చాపర నుంచి రేగులపాడుకు 13 కిలోమీటర్లు కాగా, కనీసం అందులో సగం కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. 2007లో రూ.127 కోట్లు అంచనా వ్యయమైతే, నేడు రూ.852 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌కు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఎందుకు తగిన నిధులు కేటాయించలేదో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌కు కనీసం రూ.500 కోట్లు కేటాయించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మొక్కుబడి కేటాయింపులు పాత పనుల బిల్లులకే సరిపోతుందని తెలిపారు. జిల్లాపై నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనమన్నారు. ఈ రిజర్వాయర్‌ పూర్తయితే మెళియాపుట్టి మండలంలో 3,890 ఎకరాలు, పలాస మండలంలో 6,800 ఎకరాలు, నందిగాం మండలంలో 12,090 ఎకరాలు, టెక్కలి మండలంలో 1,820 ఎకరాలు మొత్తం 24,600 ఎకరాల భూమికి సాగునీరుతో పాటుగా పలాసకు తాగునీరు ఇవ్వవచ్చని చెప్పారు. పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. జిల్లాలో గిరిజన ప్రాంతాన్ని ఐదో షెడ్యూల్‌లో చేర్చాలని, జిల్లాలో ఐటిడిఎను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ నాయకులు పాలిన సాంబమూర్తి, హనుమంతు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️