జీవన ప్రమాణాల పెంపునకు చర్యలు
ఉత్పత్తులకు ఆన్‌లైన్ మార్కెటింగ్
36,133 సంఘాలకు రూ.1821.94 కోట్లు
బ్యాంకు లింకేజీ డిఆర్‌డిఎ పీడీ కిరణ్‌కుమార్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
మహిళలు స్వయంశక్తితోపైకి రావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చెందేలా ప్రాధాన్యత ఇస్తుందని డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.కిరణ్‌కుమార్ అన్నారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉద్యాన పంటల్లో ఉత్పత్తి అవుతున్న వాటి నుంచి ఆగ్రో బేస్‌డ్ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం ఊతమిస్తోందని తెలిపారు. మరోవైపు మహిళల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేలా సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 36,177 స్వయంశక్తి సంఘాలకు రూ.1821.94 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు లక్ష్యంగా నిర్ణయించామని అన్నారు. అందులో ఇప్పటికే 17.023 సంఘాలకు రూ.1294.28 కోట్లు అందించామన్నారు. ఉమెన్ ఎంటర్ప్రెజ్ యాక్సిలరేషన్ ఫండ్ ద్వారా 1295 గ్రామైక సంఘాలకు 6900 యూనిట్లు నెలకొల్పడానికి నిర్ణయించామని తెలిపారు. ఇప్పటికే సుమారు 3 వేల యూనిట్లు నెలకొల్పామని వివరించారు. మహిళల జీవన ప్రమాణాలు పెంచుకునేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ప్ సహకారంతో మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని వివరించారు. జిల్లాలో 49.076 స్వయంశక్తి సంఘాల్లో 5,53,546 మంది సభ్యులున్నారని అన్నారు. 30 మండల సమాఖ్యలు, 1293 గ్రామైఖ్య సంఘాల ద్వారా సేవలందిస్తున్నామని తెలిపారు. ముఖాముఖిలో భాగంగా ‘ప్రజాశక్తి’కి వివరించారు. మహిళా సాధికారతకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తోంది? జిల్లాలో ఎక్కువ మంది మహిళలు నిరక్ష్య రాస్యులుగానే ఉన్నారు. వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంతో పాటు వ్యాపార, వాణిజ్య రంగాల్లో వారికి చోటు కల్పించేందుకు అనేక రకాలుగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వారి జీవన ప్రమాణాల మెరుగుపర్చడానికి, వారిని పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి పెద్దఎత్తున రుణాలు ఇస్తున్నాం. ఆస్పత్రుల నిర్వహణ, బ్యూటీ క్లినిక్‌ల నిర్వహణ, పుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు, ఇతర పారిశ్రామిక రంగాల్లో భాగస్వాములను చేస్తున్నాం. జిల్లాలో కొన్ని మహిళలు గ్రూప్‌లుగా ఏర్పడి చిరు వ్యాపారాలు సాగిస్తున్నారు. ప్రధానంగా ఉత్పాదకతను పెంచడానికి వారు ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం కీలకం. మహిళలకు మార్కెటింగ్ చేసుకునేందుకు అవసరమైన శిక్షణ ఇస్తున్నాం. మార్కెట్ ప్రాధాన్యత ఉత్పత్తుల తయారీ ఎలా సాగుతోంది? జిల్లాలో మహిళలు తయారు చేస్తున్న అనేక ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల ద్వారా నరసన్నపేట, సోంపేట మండలాల్లో అప్పడాలు, సారవకోటలో చుప్పులు, మందస కోవా, బుడితి, మాకివలస గ్రామాల్లో ఇత్తడి వస్తువులు తయారీ వంటి యూనిట్లు నడుస్తున్నాయి. వాటి పరిధిలో ఉత్పత్తిచేస్తున్న వాటిని స్థానికంగా మాత్రమే అమ్ముకోగలుగుతున్నారు. వాటిని ఆన్‌లైన్ మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం ద్వారా ఇతర ప్రాంతాలకు విక్రయించేందుకు వీలుంటుంది. ఫుడ్ ప్రోసెసింగ్ ఉత్పత్తులను సకాలంలో లబ్ధిదారులకు చేరవేయడం ద్వారా ప్రయోజనం పొందగలరు. ఎలాంటి రుణాలు ఇస్తున్నారు? స్త్రీ నిధి రుణం పొందాలంటే తప్పక సంఘ సభ్యులై ఉండాలి. సభ్యులు సమృద్ధి పొదుపు రూ.7,200 డిపాజిట్ చెల్లించి ఉండాలి. అలాగే మండల రికవరీ 75 శాతం, విఒ రికవరీ 90 శాతం, ఎస్‌హెచ్‌జి రికవరీ 98 శాతం ఉండాలి. బ్యాంకు లింకేజీ రుణం పొంది డిపాల్టరు కాకుండా ఉండాలి. అటువంటి సంఘ సభ్యులకు రూ.6 లక్షల వరకు రుణం పొందడానికి వీలుంది. రుణం పొందిన సభ్యులు 24 నుంచి 36 నెలల సులభ వాయిదాలపై 11 శాతం వడ్డీతో రుణం చెల్లించాల్సి ఉంటుంది. తరగతి వృత్తులు, వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, పాడి పరిశ్రమ, చిన్నతరహా వ్యాపారాలకు రుణం తీసుకోవచ్చు. ఒక్కో సభ్యులు రూ.లక్ష వరకు రుణం పొందేందుకు వీలుంటుంది. రుణం పొందిన సభ్యులకు బీమా సౌకర్యం ఉంటుంది. ఈ అవకాశాన్ని సభ్యులు సద్వినియోగపర్చుకుని సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా స్త్రీనిధి బలోపేతం చేసుకునేందుకు వీలవుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 22,485 మంది సభ్యులకు రూ.138.19 కోట్లు రుణం చెల్లించి లబ్ధి చేకూర్చం. ‘ఉన్నతి’ ద్వారా ఎలాంటి సౌలభ్యం ఉంది? ఉన్నతి కార్యక్రమం ద్వారా ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్ నిధులతో మహిళలకు రుణ సౌకర్యం కల్పిస్తున్నాం. సూష్మప్రణాళిక ప్రాతిపదికన ఆర్థికాభి వృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాం. రూ.20 నుంచి రూ.రెండు లక్షల వరకు రుణం పొందడానికి వీలుంది. చిరు వ్యాపారాలు, సొంతంగా ఆటోలు కొనుగోలు చేసుకుని సొంతంగా నడుపుకునేందుకు వీలుందన్నారు. ఎంతమందికి పింఛన్లు ఇస్తున్నారు?జిల్లాలో వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళ తదితరులకు ఎన్‌టిఆర్ భరోసా పింఛన్లు 3,11,533 ఉన్నాయి. సకాలంలో పింఛన్లు పొందలేని లబ్ధిదారులకు వచ్చే నెలలో పొందడానికి వెసులు బాటు కల్పించాం. జిల్లా వ్యాప్తంగా ప్రతినెలా రూ.129.61 కోట్లు పింఛను రూపంలో అందిస్తున్నాం. 92 మంది మేజరు డిసీజెస్ పర్సన్స్‌కు రూ.10 వేలు వంతున రూ. 9.50 లక్షలు, సికెన్ సెల్ డిసీజెస్‌తో బాధపడుతున్న 256 మందికి రూ.26 లక్షలు, మెమో ఫెలియోతో బాధపడుతున్న 36 మందికి రూ.3.80 లక్షలు, 75 మంది కిడ్నీ బాధితులకు రూ.7.60 లక్షలు, పక్షవాతంతో బాధపడుతూ మంచానికి పరిమితమై న వారికి రూ.15 వేలు వంతున రూ.7.65 లక్షలు ఇతర వ్యాధులతో ఉన్న వారికి పింఛన్లు ఇస్తున్నాం. వ్యాధుల బారిన పడిన 1432 మంది రూ.1.17 కోట్లు ప్రతినెలా పింఛను రూపంలో అందిస్తున్నాం.