కార్మికుల మస్టర్లు పాయింట్లు తగ్గించాలి

నగరపాలక సంస్థ పరిధిలో

ధర్నా చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

కార్పొరేషన్‌ వద్ద మున్సిపల్‌ కార్మికుల ధర్నా

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్‌ కార్మికులకు పెంచిన మస్టర్‌ పాయింట్లను తగ్గించాలని, అధికారుల వేధింపులు ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా ఉపాధ్యక్షులు ఎ.గణేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాం డిమాండ్‌ చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ సుధీర్‌ను కలిసి సమస్యను వివరించారు. సమస్య పరిష్కారానికి ఆయన చొరవ చూపకపోవడంతో, నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కార్మికులు శుక్రవారం విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉన్న మూడు మస్టర్‌ పాయింట్ల స్థానంలో ఐదు మస్టర్‌ పాయింట్లుగా పెంచడం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరినా అధికారులు పట్టించుకోకుండా వేధించడం తగదన్నారు. మస్టర్‌ పాయింట్ల స్థానంలో కొత్తగా రెండు ఏర్పాటు చేయడం వల్ల ఉదయం విధులకు హాజరు కావడానికి ఆటోల్లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రోజుకు రూ.50 ఆటో ఛార్జీలకే వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు పనులు చేపట్టేందుకు అవసరమైన పనిముట్లు పూర్తిస్థాయిలో ఇవ్వకుండా పనిచేయాలని వేధించడం తగదన్నారు. క్లాప్‌ వెహికల్స్‌ ద్వారా ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్త ఒక్కో ఇంటి నుంచి కేజీకి తక్కువ కాకుండా కార్మికులు తీసుకుని రావాలని, లేకపోతే ఆబ్సెంట్‌ వేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు తమ వైఖరి మార్చుకుని కార్మికుల సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నగర కమిటీ నాయకులు కళ్యాణ రాజు, ఆకుల శంకరరావు, డి.చిట్టి, ఎ.రాము, డి.యుగంధర్‌, ఎ.శేఖర్‌, ఎ.జనార్థన్‌, ఎ.గురుస్వామి, జె.మాధవి, ఎ.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

 

➡️