ప్రపంచంలో అత్యుత్తమ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ 

ప్రజాశక్తి – (తిరుపతి) క్యాంపస్ : ప్రపంచంలో అత్యుత్తమ గణిత మేధావులలో ప్రఖ్యాతమైన, ప్రసిద్ధిగాంచిన భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ అని ఎస్వియు ఇన్చార్జి విసి ఆచార్య సిహెచ్ అప్పారావు పేర్కొన్నారు.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ 137 వ జయంతి పురస్కరించుకుని వర్సిటీలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్వీయూలోని గణిత విభాగం ఆధ్వర్యంలో “గణిత శాస్త్రమూ, దాని అనువర్తనాలు-2024” అనే అంశం పై రెండు రోజుల జాతీయ సదస్సును గణిత శాస్త్ర సమావేశం మందిరంలో ఆదివారం ప్రారంభించారు. సదస్సును ఉద్దేశించి విసీ ఆచార్య అప్పారావు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్ర అభివృద్ధి కి చేసిన సేవలు నిరుపమానం అనీ, వర్సిటీ ప్రారంభంలో ‌ఏర్పాటైన 6 విభాగాల్లో గణిత శాస్త్ర విభాగం ఒకటనీ, అదీ 70 సంవత్సరాలు పూర్తి చేసుకుందనీ గుర్తు చేసుకున్నారు. మరో ముఖ్య అతిధి ‌రిజిస్ట్రార్ ఆచార్య మాదాల భూపతి నాయుడు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ గణిత అభివృద్ధి కి చేసిన సేవలు, ఆయన పరిశోధన ఫలితాలను‌ వివరించి, విద్యార్థులు ఆయనను స్పూర్తి గా తీసుకుని ఉన్నత స్థాయికి చేరాలని పిలుపునిచ్చారు. వరంగల్ ఎన్ఐటీకి చెందిన ప్రొఫెసర్ జీ.రాధకృష్ణమాచార్య కీలక ఉపన్యాసం చేస్తూ గణితంలో తాజా పరిశోధలు, వాటి ఫలితాలను వివరించారు. సదస్సు సంచాలకుడు, గణిత శాస్త్ర విభాగాధిపతి ఆచార్యా సి.జయ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సదస్సు అంశం “గణితం, దాని అనువర్తనాలు -2024” యొక్క ముఖ్య ఉద్యేశ్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డి.భాస్కర్ రెడ్డి, అధ్యాపకులు ఎ. సుధాకరయ్య, వి.సుగుణమ్మ, డి.భారతి, రాజేష్ యాదవ్, వాసుదేవ రెడ్డి, విశ్రాంతాచార్యులు విజయకుమార్ వర్మ, శ్రీనాధ్, విశ్వనాథ రెడ్డి, వివిధ యూనివర్శిటీల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️