ప్రజాశక్తి – మంగళగిరి రూరల్ : ఏపీ ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ విద్యార్థులు మరో సాహసోపేత యాత్రకు శ్రీకారం చుట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణకు వీరు సన్నద్ధమయ్యారు. వీరితో పాటు పలువురు అధ్యాపకులు సైతం యాత్రలో పాల్గొంటున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు యూనివర్సిటీ ఆవరణలో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రను రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తొలిసారి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణకు బయలుదేరిన యూనివర్సిటీగా ఎస్‌ఆర్‌ఎం గుర్తింపు పొందుతుంది. యూనివర్సిటీలోని ఎంటర్ప్రైన్యూర్ అండ్ ఇన్నోవేషన్ విభాగం ఆధ్వర్యంలో యాత్రకు ఏర్పాట్లు జరిగాయి.
మొత్తం 18 మంది : ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు యూనివర్సిటీ నుంచి మొత్తం 18 మంది బయలుదేరుతున్నారు. నాలుగుల నెలల కిందటే వీరిని ఎంపిక చేసి అధిరోహణకు అవసరమైన శిక్షణిచ్చారు. నేపాల్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణకు అవసరమైన అనుమతులు తీసుకున్నారు. ప్రతి రోజూ 5 నుంచి 8 కిలోమీటర్లు నడిచే సామర్ధ్యాన్ని యాత్రలో పాల్గొనే వారికి పెంచారు. కొండపల్లి, నిడమర్రు, మంగళగిరి వంటి కొండలను తక్కువ వ్యవధిలో ప్రయాస లేకుండా ఎక్కడం నేర్పారు. తక్కువ ఉష్ణోగ్రతలున్న మంచు కొండల్లో శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తకుండా వైద్యుల సలహాలను తీసుకున్నారు. యాత్రలో పాల్గొంటున్న విద్యార్థులకు ముందస్తు వైద్య పరీక్షలు జరిపించారు. మంచుకొండల్లో సులభంగా ఎక్కేందుకు దోహదపడే హైకింగ్ షఉస్, హైకింగ్ పోల్‌ను సమకూర్చుకున్నారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను చేరుకునే క్రమంలో విద్యార్థులు మొత్తం 134 కిలోమీటర్ల మేర నడవాల్సి ఉంటుంది. 5600 మీటర్ల ఎత్తును అధిరోహించాల్సి ఉంటుంది.
