ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ రాష్ట్రంలో ఎస్‌టిలకు ప్రత్యేక వర్గీకరణ చట్టం ఏర్పాటు చేయాలని రాష్ట్ర యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెసి.పెంచలయ్య డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని ఎంపిడిఒ సభాభవనంలో యానాదుల ఉద్యో గుల సంఘం జిల్లా అధ్యక్షులు నల్లి బాలకష్ణ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి కడప జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 37 లక్షల గిరిజన జనాభాలో 30 శాతం మంది యానాదులు ఉన్నారని పేర్కొన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారని తెలిపారు. అందుకు ప్రత్యేక వర్గీకరణ అవసరమని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ స్ఫూర్తి, ఆశయాలతో దేశంలో అన్ని వర్గాలకు సమ న్యాయం, సంక్షేమం ఫలాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్‌టిల ప్రత్యేక చట్టం వర్గీకరణ సాధించేందుకు ఏప్రిల్ 14న శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు జిల్లాలో ఎస్‌టి వర్గీకరణ భేరి సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఎస్‌టి వర్గీకరణ భేరిసభకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చేవ్వూరి సుబ్బారావు, మహిళా అధ్యక్షులు ఉష, రవీంద్ర, ఉద్యోగులు మేకల రమణయ్య, నిమ్మళ్ళ వెంకట రమణ, యాకసిరి హరినాధ్, మేకల చెంగయ్య, తలపల మదుసూదన్ రావు, యానాదుల సంక్షేమ సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పులి శివశంకర్, యానాదుల సంక్షేమ సంఘం కడప జిల్లా అధ్యక్షులు నీలం సురేంద్ర పాల్గొన్నారు.
