ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : నగరంలోని 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రముఖ నర్సింగ్ విద్యాసంస్థలు సెయింట్ లూక్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, విజయా లూక్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంయుక్త ఆధ్వర్యంలో బిఎస్సీ గ్రాడ్యుయేషన్ ప్రదానోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని సిరిపురంలో ఉన్న విఎంఆర్డిఏ చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖపట్నం పార్లమెంట్ ఎంపి ఎమ్.శ్రీ భరత్ హాజరై బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన పట్టభద్రులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … మనదేశంలో ప్రధానంగా మన రాష్ట్రంలో నర్సింగ్ విద్య అభ్యసించిన విద్యార్థినీ, విద్యార్థులకు అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విదేశాలకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే మంచి వేతనాన్ని గౌరవప్రదమైన ఈ నర్సింగ్ వఅత్తితో పొందగలుగుతున్నారని తెలిపారు. మాజీ ఎంపీ, గీతం వర్సిటీ పూర్వ చైర్మన్ ఎమ్. వి. ఎస్.మూర్తితో గీతం వర్సిటీకి పక్కనే ఉన్న సెయింట్ లూక్స్ విద్యా సంస్థలతో ఎంతో అనుబంధం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో 100మంది నర్సింగ్ విద్యార్థినీ, విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. సెంటర్ ఫర్ యోగ అండ్ వెల్నెస్ (ఏ యూ అనుబంధం )లో పీజీ డిప్లమో, డిప్లమో పూర్తి చేసిన విద్యార్థులకూ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సత్కరించారు. గాయత్రి విద్యా పరిషత్ మెడికల్ కాలేజ్ సర్జరీ విభాగం హెడ్ ప్రొఫెసర్ జి.అర్జున మాట్లాడుతూ …. నర్సింగ్ వృత్తి ఎంతో సేవా దఅక్పథం కలిగిందని, రోగులకు ప్రాణం పోసేది డాక్టర్లతో పాటు నర్సులేనన్నారు. గత 36 ఏళ్లుగా సెయింట్ లూక్స్ నర్సింగ్ విద్యాసంస్థలు వేలాదిమంది నర్సులకు ట్రైనింగ్, ప్లేస్‌మెంట్ కల్పించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో సర్టిఫికెట్లు స్వీకరించిన విద్యార్థులు ఇప్పటికే హైదరాబాదులోని కాంటినెంట్, విశాఖ, హైదరాబాదులో గల అపోలో, తదితర హాస్పిటళ్లలో ఉద్యోగాలు పొందారన్నారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్.ప్రభాకర్ శర్మ (అమెరికా), ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ అండ్ మిడ్ వైవ్స్, ఏఎన్‌ఎం అండ్ హెల్త్ విజిటర్స్ కౌన్సిల్ రిజిష్ట్రార్ ప్రొఫెసర్ కె.సుశీల, గాయత్రి విద్యా పరిషత్ మెడికల్ కాలేజ్ సర్జరీ విభాగం హెడ్ ప్రొఫెసర్ జి.అర్జున, టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి, సెయింట్ లూక్స్ విద్యాసంస్థల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ ప్రీతం లూక్, ప్రతినిధులు ఎం.విజయా లూక్, మమతా ప్రసాద్, షావీలా ప్రీతం, షైనీ సుమన్, తదితరులు పాల్గొన్నారు.