ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : ప్రజారోగ్యం దష్ట్యా సిబ్బంది అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు వైద్యాధికారులు, వైద్య సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని తాడికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. సిబ్బంది హాజరు నమోదు పరిశీలించి పిహెచ్‌సిలో విధులు నిర్వహిస్తున్న తీరుపై ఆరా తీశారు. ఆసుపత్రికి వస్తున్న రోగుల చికిత్సా వివరాలు ఓపి, ఐపి రికార్డులు పరిశీలించారు. మందులు లభ్యత ,అత్యవసర చికిత్సకు ప్రాథమికంగా అవసరమైన మందులు, వైద్య పరికరాల పనితీరు, కుక్క,పాము కాటు ఇంజక్షన్ల లభ్యత పరిశీలించారు. వార్డులో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్యస్థితి అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ లో జ్వర నిర్దారణ పరీక్షలు, నివేదికలపై ఆరా తీశారు. పిహెచ్‌సిలో సాధారణ కాన్పులు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం డాక్టర్ భాస్కరరావు పలు ఆరోగ్య కార్యక్రమాలపై సిబ్బందితో సమీక్ష జరిపారు. రక్తహీనత నివారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గర్భిణీ, బాలింతలు, కిషోర బాలికలు ఆరోగ్య ఆరోగ్య శ్రేయస్సుకు సమిష్టి కషి చేయాలన్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉంచాలన్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య శిబిరాలు నిర్వహిం చాలన్నారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య సమస్యలను సత్వరమే గుర్తించాలన్నారు. అక్కడ ఫీడర్ అంబులెన్స్‌ను పరిశీలించి వాటి సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సిబ్బంది అన్ని వేళల్లో అందుబాటులో ఉండాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు, డిఎస్‌ఓ శంకర్, వైద్యాధికారులు డాక్టర్ బుద్దేశ్వరరావు, డాక్టర్ అభిలాష్, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.