ప్రజాశక్తి-యర్రగొండపాలెం : కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీయాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం యర్రగొండపాలెం పట్టణంలోని వైసిపి కార్యాలయంలో త్రిపురాంతకం మండల వైసిపి నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నెరవేర్చలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసగించిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలు కావస్తున్నా సూపర్ సిక్స్‌లో ఒక్క పథకం కూడా అమలు చేయలేదని అన్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం కనీసం మంచి నీరు ఇచ్చే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వైసిపి కార్యకర్తలు వాళ్లని నిలదీయాలని చెప్పారు. త్రిపురాంతకం మండలంలో వైసిపి కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పనిచేయాలన్నారు. ఎన్నికలలో ఐక్యంగా పని చేశారు కాబట్టే తాను ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేశారు. అదే పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగించి వర్గాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఏకత్రాటిపై నడవాలన్నారు. అనంతరం త్రిపురాంతకం మండలంలోని అన్ని పంచాయతీలలో గల సమస్యలను నాయకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలో ఆళ్ల ఆంజనేయరెడ్డి, కోట్ల సుబ్బారెడ్డి, త్రిపురాంతకం సర్పంచ్ పొన్నా వెంకటలక్ష్మి, వైసీపీ మండల కన్వీనర్ సింగారెడ్డి పోలిరెడ్డి, జడ్పిటిసి మాకం జాన్ పాల్, వైసీపీ మహిళా నాయకురాలు సరళ కుమారితోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లోని వైసీపీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
