గెలుపొందిన వారికి ధృవీకరణ పత్రాలు ఇస్తున్న కమిషనర్, అడిషనల్ కమిషనర్
ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటిని కూటమి కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన ఎన్నికల్లో ఆరు స్థానాలకుగాను అన్నింటిలో కూటమి అభ్యర్థులు పైచేయి సాధించారు. ఐదుగురు టిడిపి అభ్యర్థులు, ఒకరు జనసేన అభ్యర్థి గెలుపొందారు. టిడిపిలో చేరిన వైసిపి కార్పొరేటర్లే కాకుండా, పోలింగ్ వరకూ వైసిపిలో శిబిరంలో ఉన్న వారిలో కొందరు కూటమికి ఓటు వేయటం గమనార్హం. కొన్ని రోజులుగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. గత మూడు నాలుగు రోజులుగా ఇరు పక్షాలు వారి మద్దతు దారులతో హైదరాబాద్‌లో క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. పోలింగ్ సమయానికి ప్రత్యేక బస్సుల్లో జిఎంసి ప్రధాన కార్యాలయంలోని పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు. మొత్తం 56 ఓట్లు పోల్ అవగా ఒక ఓటు తిరస్కరణకు గురైంది. జిఎంసి కౌన్సిల్‌లో మొత్తం 57 స్థానాలకుగాను కార్పొరేటర్ కృష్ణారెడ్డి మృతి చెందగా మిగిలిన 56 మంది ఉన్నారు. అందులో 45 వైసిపి, 9 టిడిపి, ఇద్దరు జనసేన కార్పొరేటర్లు ఉన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఆ తర్వాత 18 మంది వైసిపి కార్పొరేటర్లు టిడిపిలో చేరారు. మొత్తం 56 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 28 కాగా కూటమికి 29 మంది మద్దతు లభించింది. దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. వైసిపి శిబిరంలో ఉన్న 27 మంది కార్పొరేటర్లలోనూ కొందరు పోలింగ్‌లో క్రాస్ ఓటింగ్ వేసినట్లు స్పష్టమవుతోంది. పోలింగ్ అనంతరం ఎన్నికల అధికారి, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు ఫలితాలు ప్రకటించారు. వారిలో టిడిపి కార్పొరేటర్లు 35వ డివిజన్ ఈరంటి వరప్రసాద్ 33 ఓట్లు, 10వ డివిజన్ షేక్.మీరావలి 32 ఓట్లు, 46వ డివిజన్ నూకవరపు బాలాజీ 31 ఓట్లు, 43వ డివిజన్ కొమ్మినేని కోటేశ్వరరావు 31 ఓట్లు, 51వ డివిజన్ ముప్పవరపు భారతి 30 ఓట్లు, జనసేన కార్పొరేటర్ 16వ డివిజన్ దాసరిలక్ష్మీ దుర్గ 32 ఓట్లు సాధించి గెలుపొందారు. వైసిపి నుండి పోటీ చేసిన 2వ డివిజన్ కార్పొరేటర్ మర్రి అంజలి 24 ఓట్లు, 33వ డివిజన్ కార్పొరేటర్ గోపి శ్రీనివాస్ 24 ఓట్లు, 34వ డివిజన్ కార్పొరేటర్ బూసి రాజలత 24 ఓట్లు, 53వ డివిజన్ కార్పొరేటర్ ధూపాటి వంశీబాబు 23 ఓట్లు, 5వ డివిజన్ కార్పొరేటర్ యాట్ల రవికుమార్ 23 ఓట్లు, 24వ డివిజన్ కార్పొరేటర్ అడకా పద్మావతి ఒక ఓటు సాధించారు. వైసిపి తరపున నామినేషన్ వేసిన ఆ తర్వాత అడకా పద్మావతి టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. గెలుపొందిన అభ్యర్థులకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
జిఎంసి వద్ద ఉత్కంఠ..
పోలింగ్ సందర్భంగా జిఎంసి ప్రధాన కార్యాలయం వద్ద తీవ్ర ఉత్కంఠత నెలకొన్నది. ఇరు పార్టీల శ్రేణులు కార్పొరేషన్ ఎదుట మోహరించాయి. పోలింగ్ సందర్భంగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. పలుసార్లు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ప్రయత్నం చేసిన ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు బలవంతగా దూరంగా పంపించారు. ఓటు వేసేందుకు వచ్చిన కార్పొరేటర్లను పోలింగ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. టిడిపి ఎమ్మెల్యేలు గల్లా మాదవి, నసీర్ అహ్మద్, బి.రామాంజనేయులు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి, వారి కార్పొరేటర్లతో మాట్లాడారు. కార్పొరేటర్లు ఓటు వేసే వరకూ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి, నసీర్ మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి కార్పొరేటర్లు తమకు మద్దతు ఇచ్చారని, ప్రలోభాలేమీ లేవని అన్నారు. గత వైసిపి పాలనలో నగర అభివృద్ధిని పూర్తిగా నీరుగార్చారని, దీంతో కార్పొరేటర్లు తమను గెలిపించిన ప్రజలకు మంచి చేయాలని టిడిపిలో చేరారని అన్నారు. కాగా వైసిపి కార్పొరేటర్లతో వచ్చిన మేయర్ కావటి మనోహర్‌నాయుడు, డిప్యూటీ మేయర్ వజ్రబాబు మాట్లాడుతూ తమ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి, సంతలో పశువుల్లాగా కొనుగోలు చేశారని ఆరోపించారు. ప్రజలు అన్ని విషయాలనూ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన వైసిపి కార్పొరేటర్లు
