ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం సిటీ క్లబ్ ఆవరణలో జిల్లా స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ 2025 ప్రారంభమయ్యింది. ఐదు విభాగాల్లో ఛాంపియన్షిప్ పోటీలను సిటీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అండర్ 12, 16, 30 ప్లస్, 40 ప్లస్, 50 ప్లస్, విభాగాలకు పోటీలు కొనసాగుతున్నాయి. ఈ 2025 జిల్లా ఛాంపియన్షిప్ పోటీల్లో దాదాపు 60 మంది క్రీడాకారులు పాల్గన్నారు. టెన్నిస్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ తరహా పోటీలను త్వరలో మరిన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు రామారావు మీడియాకి తెలిపారు. ప్రధానంగా పిల్లలకు టెన్నిస్ క్రీడ పట్ల ఆసక్తి పెంచేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, వెటరన్ క్రీడాకారులు సహితం అధిక సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గనడం ఆనందంగా ఉందని అన్నారు. జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలను ఒకప్పుడు సిటీ క్లబ్ నిర్వహించిందని ఎందరో అంతర్జాతీయ ఆటగాళ్లు సిటీ క్లబ్ లో ఆడారని ఈ సందర్భంగా నిర్వాహకులు రంగబాబు అన్నారు. ఆ ఖ్యాతినీ కొనసాగిస్తామని తెలిపారు. ప్రధానంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు టెన్నిస్ నేర్పించేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. అతి తక్కువ ఖర్చుతో సిటీ క్లబ్ లో టెన్నిస్ నేర్పిస్తున్నామని తెలిపారు. ఐదు విభాగాల్లో నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గంటున్న క్రీడాకారులకు అన్ని వసతులు ఏర్పాటు చేశామని నిర్వాహకులు వైభవ్ తెలిపారు. రెండు రోజులపాటు ఛాంపియన్ షిప్ 2025 టెన్నిస్ పోటీలను నిర్వహిస్తామని ఆదివారం ఫైనల్స్ ఉంటాయని వైభవ్ చెప్పారు. టెన్నిస్ జాతీయ స్థాయి క్రీడాకారులు సన్యాసిరాజు, కోచ్ గౌరీశంకర్, నిర్వాహకులు సాత్విక్ ,కౌశిక్, సీనియర్ ప్లేయర్స్ ఈ పోటీలను ప్రారంభించారు.
ఉత్సాహంగా జిల్లా స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం
