రైతు సమస్యలపై 17న రాష్ట్రవ్యాప్త ధర్నా

Jan 7,2025 23:51

సమావేశంలో మాట్లాడుతున్న వి.కృష్ణయ్య
ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్‌ :
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 17న విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద జరిగే రాష్ట్రవ్యాప్త ధర్నాకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి రైతులు తరలిరావాలని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. వడ్డేశ్వరంలోని కేబి భవన్‌లో రైతుసంఘం జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రూ.20 వేల పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా జమ చేయలేదని, రబీ పంటలు సాగవుతున్న నేపథ్యంలో తక్షణమే వాటిని జమ చేయాలని డిమాండ్‌ చేశారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం పంటలకు మద్దతు ధరలు కల్పించాలని, దీనిపై చట్టం చేయాలని కోరారు. రైతుల ఆత్మహత్యల నివారణ కోసం వారి రుణాలు మాఫీ చేయాలని, కేరళ రాష్ట్రం తరహాలో రుణమాఫీ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించి, అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని కోరారు. వయసు మళ్లిన రైతులు, వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.10 వేల పింఛను ఇవ్వాలన్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఈ అంశాలపై చేపట్టే ధర్నాను రైతులు జయప్రదం చేయాలని కోరారు. రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు మాట్లాడుతూ గుంటూరు ఛానల్‌ పొడిగింపునకు నిధులు మంజూరు చేయాలని, పెదవడ్లపూడి హై లెవెల్‌ ఛానల్‌ పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు. సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజరుకుమార్‌ మాట్లాడుతూ పాడి రైతులకు ఇతర రాష్ట్రాల్లో ఇచ్చే మాదిరిగా లీటరుకు రూ.ఐదు బోనస్‌ కలిపి ఇవ్వాలన్నారు. పాడి గేదెల కొనుగోలుకు పాడి రైతులకు రుణాలు మంజూరు చేయాలని, రైతు బీమా పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలన్నారు. రైతుసంఘం గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా రైతుల ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో నాయకులు కె.వెంకటేశ్వరరావు, కె.ఈశ్వరరెడ్డి, టి.బక్కిరెడ్డి, శివ, ఎం.శివసాంబిరెడ్డి, వి.భారతి పాల్గొన్నారు.

➡️