3 రోజులు అప్రమత్తంగా ఉండండి : అనకాపల్లి ఆర్‌డిఒ

Aug 31,2024 17:28 #3 days, #Anakapalli RDO, #Stay alert

దేవరాపల్లి (అనకాపల్లి) : అల్పపీడన ప్రభావం కారణంగా రానున్న మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి ఆర్డీవో ఎ.చిన్నికృష్ణ తెలిపారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ వెల్లడించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ ఆదేశాల మేరకు శనివారం రైవాడ జలాశయాన్ని పరిశీలించారు. జలాశయం ఏఈ డి.నరేష్‌ తో మాట్లాడి జలాశయం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 108.15 మీటర్లు నమోదయింది. 365 క్యూసెక్కులు ఇన్‌ ఫ్లో జలాశయం లోకి వచ్చి చేరుతుంది. జలాశయానికి ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని ఏఈ నరేష్‌ ఆర్డీవోకు వివరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో చిన్నికృష్ణ మాట్లాడుతూ తుఫాన్‌ ప్రభావం కారణంగా మండల స్థాయి, గ్రామస్థాయి అధికారులంతా స్థానికంగా ఉండాలనిఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న చెరువుగట్టులను గుర్తించి యుద్ధ ప్రాతిపదికంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట రెవిన్యూ అధికారులు సతీష్‌, నాగేశ్వరరావు ఉన్నారు.

➡️