ఖర్చుల వివరాల కోసం కార్యాలయంలోనే ఉంటా

Jan 22,2025 23:13

ప్రజాశక్తి-గుంటూరు : బుడమేరు వాగు వరదల సహాయార్థం గుంటూరు నగర పాలక సంస్థ వెచ్చించిన రూ.9.24 కోట్లకు సంబంధించిన పూర్తి వివరాలను తనకు చూపించాల్సిన బాధ్యత కమిషనర్‌కు ఉందని నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌ నాయుడు అన్నారు. ఈ వివరాల కోసం తాను గురువారం ఉదయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నగర పాలక సంస్థలోని తన చాంబర్‌లో అందుబాటులోనే ఉంటానని ప్రకటించారు. ఈ మేరకు మేయర్‌ బుధవారం జిఎంసిలోని తన ఛాంబర్‌లో విలేకర్లతో మాట్లాడారు. వరద బాధితులకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో, కమిషనర్‌ తమ దృష్టికి తీసుకురాగా వరద బాధితులకు అండగా ఉండాలని కమిషనర్‌కు తానే సూచించామన్నారు. జిఎంసి ఖర్చు చేసిన రూ.9.24 కోట్లపై కౌన్సిల్‌ సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్‌ సరైన సమాధానం ఇవ్వకుండా, సభ నుండి వాకౌట్‌ చేశారన్నారు. బుడమేరువాగు ఘటనపై చర్చించేందుకు సమావేశం నిర్వహించాలని కమిషనర్‌కు సూచించినా స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చి సమావేశం జరగకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. జిఎంసిలో జరిగిన అవినీతిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశామని చెప్పారు. గతనెల డిసెంబర్‌ 20న కౌన్సిల్‌ సమావేశం జరిగిందని, అప్పటినుండి ఖర్చుల వివరాలు వెల్లడించాలని కమిషనర్‌ను అడిగినా వారు స్పందించట్లేదని తెలిపారు. నగర ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చిన డబ్బులను నగర అభివృద్ధికి వెచ్చించాలని, సదరు నిధులు గోల్‌మాల్‌ అవుతుంటే వాటిపై ప్రశ్నించే హక్కు తమకు ఉందని అన్నారు. జిఎంసి నుండి విడుదల చేసిన నిధులు అనధికారుల ఖాతాల్లోకి జమైనట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని మేయర్‌ చెప్పారు.

➡️