ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోవడం కోసం 1522 రోజులుగా పోరాటం చేస్తున్న విశాఖ ఉక్కు కార్మికుల మనోధైర్యం, పోరాట పటిమ వెలకట్టలేనివని, ఈ పోరాటం చారిత్రాత్మకమైనదని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని ఆయన ఆదివారం సాయంత్రం సందర్శించారు. ఉక్కు పరిరక్షణ పోరాటానికి మద్దతు తెలుపుతూ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్లాంట్‌కు ప్యాకేజీ ప్రకటించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని తెలిపారు. ప్రయివేట్ వ్యక్తులకు అమ్మడానికి ముందు స్టీల్‌ప్లాంట్‌కు ఎలాంటి అప్పులూ లేవని చూపించేందుకే ఈ ప్యాకేజీని ప్రకటించారన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ప్లాంట్ పరిరక్షణ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మోడీతో మాట్లాడాలని తెలిపారు. స్టీల్‌ప్లాంట్ కోసం యువకునిగా ఉన్నప్పుడు పోరాడిన వెంకయ్యనాయుడు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరముందన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పించిన స్టీల్‌ప్లాంట్‌లోని కార్మికులు నేడు అర్ధాకలితో పని చేయాల్సి వస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్, సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్టు లేబర్ యూనియన్, పోరాట కమిటీ నాయకులు పాల్గొన్నారు.
