ప్రజాశక్తి -అనంతపురం క్రైం : గ్రామాల్లో బెల్ట్ దుకాణాలపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ పి.జగదీష్ అన్నారు. ఈ మేరకు బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం ఎస్పీ మాట్లాడుతూ … గ్రామాలు, కాలనీలలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించి విస్తఅత తనిఖీలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా వేసి ముందస్తు జాగ్రత్తలు నిర్వహించాలన్నారు. ఈనేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు నేడు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. కర్నాటక మద్యం, నాటు సారా, గుట్కా నియంత్రణ కోసం అనుమానితుల, పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో పశువుల పాకలు, గడ్డి వాము ప్రాంతాలు, దుకాణాలు, బడ్డీ కొట్లు, హోటళ్లు, డాబాలలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అక్రమ మద్యం జోలికెళితే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. పాత కేసుల్లో నిందితులతో సమావేశమై పాత పంథా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. బెల్టు దుకాణాలు నిర్వహించి మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆయా గ్రామాలలో హెచ్చరించారు.