ప్రజాశక్తి – కడప : స్వామి వివేకానందుని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎస్. ఇమ్రాన్ అన్నారు. స్వామి వివేకానందుని జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా యువజన సర్వీసుల శాఖ (స్టెప్) ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవ వేడుకలను కడప నగరంలో గల హజరత్ ఆయేషా జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి ఆధితులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి యస్. ఇమ్రాన్ మాట్లాడుతూ … స్వామీ వివేకానంద 1863 జవవరి 12 న జన్మించాడని, రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడని, వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడని కొనియాడారు.హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలోనే ఒక ప్రముఖ వ్యక్తిని, రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడని, స్వామీ వివేకానందను భారతదేశ యూత్ ఐకాన్ గా కొనియాడుతారని తెలిపారు. స్టెప్, ముఖ్య కార్యనిర్వహణాధికారి సి. సాయి గ్రేస్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జ్ఞానం, విశ్వాసం కలిగిన వ్యక్తి, నిజమైన తత్వవేత్త, అతని బోధనలు యువతను ప్రేరేపించడమే కాకుండా దేశ అభివృద్ధికి మార్గం సుగమం చేశాయని తెలిపారు. అందుకే భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 12ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. కళాశాల కరెస్పాండంట్ సుల్తాన్ మొహిద్దిన్, ప్రెసిడెంట్ యాసిన్ బాష, ప్రిన్సిపాల్ కె. హసీనా బేగం మాట్లాడుతూ స్టెప్ తరపున ఈ కార్యక్రమాన్ని మా కళాశాలలో నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని, ఇటువంటి కార్యక్రమాల వలన యువతకు ఎంతో మేలు కలుగుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమములో దాదాపు 500 మంది విద్యార్థినులతో పాటు స్టెప్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.