పచ్చాకు ముఠా కూలీల రక్షణకు చర్యలు చేపట్టాలి

ప్రజాశక్తి-మద్దిపాడు : పచ్చాకు ముఠా కూలీల రక్షణకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టి, ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. మద్దిపాడులోని వెలుగు కార్యాలయం వద్ద పచ్చాకు (పొగాకు) ముఠా కూలీల సమావేశం కొంగల చిన్న అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ పొగాకు ఎగుమతులు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పదివేల కోట్ల పైగా పన్నుల రూపంలో ఆదాయం వస్తుందన్నారు. దేశంలో వినియోగం ద్వారా అమ్మకం పన్నుల ద్వారా మరో నాలుగు వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఇంత ఆదాయానికి మూల కారకులైన ముఠాకూలీలకు కనీస రక్షణ చట్టాన్ని కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. ముఠా కూలీలు పొగాకు కొట్టుకొని ట్రాక్టర్‌ మీద తీసుకొచ్చే సందర్భంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన, ప్రమాదాలకు గురైన కుటుంబాలను ఆదుకునేందుకు రైతు దయాదక్షిణ్యాలతోనే సహాయం అందుతుందన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదని తెలిపారు. డిసెంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకూ జరిగే ఈ పనిలో జిల్లాలో లక్ష మంది పైగా కార్మికులు పచ్చకు ముఠాపనిలో నిమగమై ఉంటారన్నారు. బాపట్ల, పలనాడు జిల్లాల నుంచి కూడా ప్రకాశం జిల్లాకు వలస వచ్చి పొగాకు బ్యారెన్ల వద్ద నివాసం ఉంటూ వందలాది మంది కూలీలు పనిచేస్తారన్నారు. వారికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నెరుసుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పొగాకు పంటలో ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా ప్రసిద్ధి గాంచిందన్నారు. ప్రకాశం జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో 100 మిలియన్‌ కేజీలకు పైగా పొగాకు పండుతుందన్నారు. గత మూడేళ్లుగా కొంత ఆదాయ మార్గం పెరుగు తున్నందున రైతులు పెద్ద ఎత్తున ఈ పంట వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. పని చేసే సందర్భాలలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ క్రమంలో పచ్చాకు ముఠా కూలీల రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఉబ్బా వెంకటేశ్వర్లు, ముఠామేస్త్రీలు కొత్తిమీర సీమోను, మేడికొండ నాగేశ్వరరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

➡️