ప్రజాశక్తి – ఆలమూరు : బీవీలంక రహదారిలో కల్వర్టు విస్తరణకు చర్యలు చేపడుతున్నట్లు పంచాయతీరాజ్ డిఈ ఏ.వి.సూర్యనారాయణ అన్నారు. మండలంలోని బడుగువానిలంకకు ఏటిగట్టు నుండి గ్రామంలోకి వెళ్లే సుమారు కిలోమీటరు మేర ప్రధాన రహదారికి ఇరువైపులా రూ. 30 లక్షలతో సిసి రోడ్డుతో విస్తరణ పనులు జరుగుతుండగా సోమవారం ఆయన పరిశీలించారు. ఇదిలా ఉండగా ఈ రహదారి మద్య గోదావరి పాయలో రెండు కల్వర్టులు గతంలో నిర్మించగా వాటిలో ఒకటి రహదారి విస్తరణకు అనుకూలంగా ఉండగా, మరొకటి వెడల్పు చిన్నదిగా ఉందన్నారు. అయితే వరదల సమయంలో రెండు కల్వర్టులు గోదావరిలో మునిగిపోతూ ఉంటాయని, నడిచి వెళుతున్న గ్రామస్తులు చిన్న కల్వర్టు వద్ద అదుపుతప్పి గోదావరిలో కొట్టుకుపోవడంతో కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు బయటపడ్డారని తనకు వివరించారన్నారు. దీనిపై గ్రామానికి చెందిన కూటమి నాయకులు దూలం రాంబాబు, పాలూరి గోవిందరాజు, పడాల అమ్మిరాజు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దృష్టికి తీసుకుని వెళ్లారని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే ఆదేశాలతో ప్రమాద స్థలాన్ని పరిశీలించామన్నారు. కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి అనుమతులకు పంపించి నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు పంచాయతీరాజ్ డిఇ తెలిపారు. అలాగే ఈ ప్రాంతంలో పలు ప్రమాదాలు జరిగినట్లు స్థానిక ప్రజల నుండి ఆయన పూర్తి వివరాలు సేకరించుకుని వెళ్లారు. ఆయన వెంట ఇంజనీరింగ్ అసిస్టెంట్ వంశీ ఉన్నారు.