అక్రమ తొలగింపులు ఆపాలి

ప్రజాశక్తి -రాచర్ల: అక్రమ తొలగింపులు ఆపాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి.ఆవులయ్య కోరారు. రాచర్ల మండలం పాలకవీడు ఎంపిపి పాఠశాలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికురాలు డి.భారతిని ఉద్యొగం నుండి తొలగించవద్దంటూ శనివారం రాచర్ల మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో బాధితురాలితో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆవులయ్య, రాచర్ల మండల కార్యదర్శి డి.తామస్‌లు మాట్లాడుతూ ఎస్‌ఎంసీ కమిటీ సమావేశం జరపకుండా సమావేశం జరిపినట్టుగా స్థానిక రాజకీయ నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేసి భారతిని బలవంతంగా తొలగించాలంటూ సంతకాలు చేపించారన్నారు. ఇందులో ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ రెడ్డి ముఖ్య పాత్ర పోషించినట్లు వారు ఆరోపించారు. ఎస్‌ఎంసీ కమిటీ సమావేశాన్ని రాచర్ల మండలం విద్యాశాఖాధికారుల ఆధ్వర్యంలో నిర్వహించాలని సిఐటియు నాయకులు ఎంఈవోకు విజ్ఞప్తి చేశారు.

➡️