నివాసాల మధ్యలో సెల్‌ టవర్‌ నిర్మాణ పనులను ఆపండి : కాలనీవాసుల ఆందోళన

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : కాలనీ మధ్యలో ఏర్పాటు చేస్తున్న సెల్‌ టవర్‌ నిర్మాణ పనులను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ … 23వ డివిజన్‌ టిడిపి మాజీ కార్పొరేటర్‌ చింత చిన్ని ఆధ్వర్యంలో చిన్న ఉల్లింగిపాలెం, ఎస్‌ సి కాలని, పెద్ద ఉల్లింగి పాలెం ప్రజలు టవర్‌ నిర్మాణం వద్ద బుధవారం ఆందోళన నిర్వహించారు. ప్రమాదకరమైన టవర్‌ ను వేలాది మంది నివసించే కాలని మధ్య ఏర్పాటు చేయడం ఏమిటంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనావాసాల మధ్య సెల్‌ఫోన్‌ టవర్‌ ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ సదరు సెల్‌ నెట్‌వర్క్‌ వాళ్లు అర్థరాత్రి సమయాల్లో టవర్‌ నిర్మాణం చేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి సమయాల్లోనే నిర్మాణ పనులు చేపట్టడం వెనుక ఆంతర్యం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా పోర్ట్‌ కు సంబంధించి ఇక్కడ కడుతున్నాం అని మభ్యపెడుతున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేడియేషన్‌ తో ప్రమాదాలకు కారణమయ్యే టవర్‌ నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయలని లేకపోతే టవర్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని వార్డు ప్రజలు హెచ్చరించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళతామన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో శివన్నారాయణ, డివిజన్‌ లోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️