ప్రజాశక్తి-గజపతినగరం : వైసిపి అనుబంధ కమిటీలను గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు బలోపేతం చేయాలని మాజీ ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. శనివారం స్థానిక వైసిపి కార్యాలయంలో అనుబంధ కమిటీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి సూపర్ సిక్స్ చూపించి అందరితో ఓట్లు వేయించుకొని, రాష్ట్ర ప్రజలందరినీ నిలువునా మోసం చేసిందన్నారు. సర్పంచులను, ఎంపిటిసిలను కాదని, అధికార మదంతో అధికారులను భయపెట్టి, టిడిపి కార్యకర్తలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి, వాలంటీర్లకు రూ.10 వేలు, మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని దగా చేసిన దొంగల ప్రభుత్వం టిడిపి సర్కారని దుయ్యబట్టారు. అప్పులతో రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారని పెద్ద ఎత్తున గత వైసిపి ప్రభుత్వంపై గ్లోబల్ ప్రచారం చేశారని, ఇప్పుడు మీరు చేసిన రూ.1.12 లక్షల కోట్ల అప్పులు ఏమయ్యాయని నిలదీశారు. అమరావతి పేరుతో 40 వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తూ సగానికి పైగా చంద్రబాబు తనయుడు లోకేష్ జేబుల్లోకి మళ్ళించుకుంటున్నారని ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న హామీ ఏమైందని స్థానిక మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని ప్రగల్బాలు పలుకుతున్న మంత్రికి నియోజకవర్గంలోని ఓలం కంపెనీని కొనసాగిస్తూ, లేదంటే ఆ స్థానంలో వేరే కంపెనీని ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి గార తవుడు, వైసిపి నాయకులు కరణం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
