ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : విజయనగరం పట్టణంలో ఉన్న సాంఘిక సంక్షేమ విద్యార్డినుల హాస్టల్ – 3 నందు ఫుట్ పాయిజన్ జరిగింది. దీనివలన 20 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురై.. ప్రభుత్వ హాస్పిటల్ నందు ఐసియూలో జాయిన్ అయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న విద్యార్థులను ఎస్ఎఫ్ఐ బృందం పరామర్శించింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు డి. రాము, సిహెచ్ వెంకటేశ్ లు మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టల్లో పరిస్థితి రాను రాను అగమ్య గోచరంగా తయారవుతుందని విమర్శించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, హాస్టల్ వార్డెన్ ల నిర్లక్ష్యం కలగలిసి విద్యార్థులను ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. గత వారం రోజులుగా ఎస్ఎఫ్ఐ బృందం, విద్యార్థులు హాస్టల్ వార్డెన్ కి ఎంత మొరపెట్టుకుంటున్నా ఫుడ్ మార్చకపోవడంతో నిన్నటి రాత్రి విద్యార్థులకు పెట్టిన ఆహారం వికటించడంతో దాదాపుగా 20 మంది విద్యార్థులు హాస్పిటల్లో జాయిన్ అయ్యారని తెలిపారు. వీరి పరిస్థితి క్షీణించడంతో జనరల్ వార్డు నుంచి ఐసీయూలోకి మార్చారని తెలిపారు. ఇంతటి పరిస్థితి జరుగుతున్న ఇప్పటివరకు హాస్టల్ సంక్షేమ అధికారిని విద్యార్థులని పరామర్శించకపోవడం సిగ్గుచేటని వారు విమర్శించారు. సాంఘిక సంక్షేమ డిపార్ట్మెంట్ కూడా కనీసం స్పందన లేకపోవడం చూస్తుంటే అధికారులు రాజకీయ నాయకుల ప్రదక్షిణలే తప్ప విద్యార్థుల బాధలు పట్టనట్టు కనబడుతుందని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకుల ప్రదక్షిణలు మాని విద్యార్థుల సమస్యలు పట్టించుకోవాలని తక్షణమే డిడి హాస్పిటల్లో ఉన్న విద్యార్థులని పరామర్శించి వారికి మెరుగైన సౌకర్యం అందించేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇంతటి ఘోరానికి కారణమైన వార్డెన్ రాధామనిపై తక్షణమే శాఖపరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని, ఈ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో డి డీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిస్తామని దానికి జిల్లా విద్యా యంత్రాంగం, సాంఘిక సంక్షేమ శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం హాస్పిటల్లో ఉన్న విద్యార్థులు మాట్లాడుతూ ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా వారిని పరామర్శించలేదని కనీసం ఉన్నామ లేక పోయామా అన్న విషయం కూడా వారికి లేకుండా పోయిందని ఆవేదన వెల్లిబుచ్చారు. తల్లిదండ్రులు చదువు కోసం మమ్మల్ని హాస్టల్లో ఉంచితే ప్రభుత్వాలు కనీసం వారి విధులు మరిచి ప్రవర్తిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకీ పాల్గొన్నారు.
హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
