అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : డిఎస్పి మోహన్‌

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌ : ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని నర్సీపట్నం డిఎస్పి మోహన్‌ హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో కార్డన్‌ సర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. అనంతరం నర్సీపట్నం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో డిఎస్పి మోహన్‌ మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఫలితాలు వెలువడే వరకు ప్రజలందరూ సమయం పాటించి, పోలీసులకు సహకరించాలన్నారు. ఇప్పటికే రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌ నిర్వహించామని, ఎలాంటి అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించామన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా మంగళవారం ఉదయం నర్సీపట్నం మున్సిపాలిటీలో కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించామన్నారు. ఈ తనిఖీలలో ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్న 68 ద్విచక్ర వాహనాలను, ఆటో, కారు, బొలెరో వాహనాలను గుర్తించి, పోలీస్‌ స్టేషన్‌కు తరలించమన్నారు. వీటికి సరైన పత్రాలు చూపించి వాహనాలను తీసుకు వెళ్ళవచ్చన్నారు. అదేవిధంగా ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు నిర్వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని, అలాగే 144, 30 సెక్షన్లు అమలులో ఉన్నాయని, ఎక్కడ నలుగురికి మించి గుంపులుగా ఉండకూడదని, ప్రజలు అర్థం చేసుకొని పోలీసులకు సహకరించాలని డిఎస్పి మోహన్‌ కోరారు.

➡️