ప్రజాశక్తి – రాయచోటి టౌన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌పి వి.విద్యాసాగర్ నాయుడు అన్నారు. ఆదివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 5న రాయచోటి టౌన్‌లో సాయంత్రం ఏడు నుండి, ఎనిమిది గంటల సమయంలో దాదాపు 200 మందితో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం పూజ చేసుకుంటూ, ఠాణా సర్కిల్ వైపు రావడంతో మసీదు దగ్గర కొంతమంది స్లొగన్స్ ఇవ్వడంతో అభ్యంతరం తెలిపారని, అప్పటికే అక్కడ బందోబస్తులో పోలీసులను నియమించామని చెప్పారు. పెద్దలు ఆ ప్రాంతంలో లేక పోవడంతో ముఖ్యంగా కుర్రాళ్లు స్లోగన్‌లు చేయడం వల్ల ఈ సున్నిత అంశం ఏర్పడిందన్నారు. ఆ రోజు ఇరువర్గాల పెద్దలు రోడ్లమీదకు వచ్చి ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదని, కొందరు ఆకతాయిల వల్ల అత్యుత్సాహంగా,తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని చెప్పారు. తర్వాత మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన పీస్ కమిటీ సమావేశంలో నిర్వహించామని, ఆ కమిటీలో ఇరు వర్గాల పెద్దలతో మాట్లాడడంతో తర్వాత ఒక అవగాహనకు రావడం వచ్చారని ఎస్‌పి వివరించారు. ఈ క్రమంలో సున్నితమైన అంశాన్ని చాలామంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా కొందరు ఆకతాయిలు భక్తుల మీద దాడులు దాడి చేసినట్లు, అదేవిధంగా భక్తులు వెళ్తున్న బస్సును మొత్తం పగలగొట్టారని, తప్పుడు కథనాలు వ్యాప్తి చేశారని చెప్పారు. ఇది హైవే రహదారి కావడం అయ్యప్పస్వామి భక్తులు మినీ వ్యాన్‌లో వెళ్తున్న సమయంలో మసీదు దగ్గర ఆగిపోవడంతో ట్రాపిక్ జామ్ అయ్యిందని చెప్పారు. మసీదు దగ్గర ఉన్న వారు కొందరు వ్యాన్‌కు దారి ఇస్తూ, తమ పోలీసులకు కూడా ఎంతగానో సహకారం అందించారు చెప్పారు. అయితే కొందరు ఆకతాయిలు బస్సుపై చేతులతో కొట్టడం వల్ల ఒక అద్దం మాత్రం పగిలింది, రాయచోటిలో హిందువులు ముస్లిములు కొట్టుకోలేదని చెప్పారు. ఈ ఘటన పేరు చెప్పి, రాజకీయంగా కానీ, ఇతర ఏ కారణాల వల్ల కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియా వేదికలలో తప్పుడు కథనాలు సష్టిస్తున్నారని, ఇప్పటికే ఇలాంటి వారిని గుర్తించామని, వారి మీద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చే వారి గురించి ప్రజలకు తెలిస్తే పోలీసు శాఖకు తెలియజేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. సమావేశంలో ఎఎస్‌పి వెంకటాద్రి, రాయచోటి డిఎస్‌పి ఎం.ఆర్. కష్ణమోహన్, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.