శిక్షణలో మాట్లాడుతున్న సిసిఎల్‌ఎ ఛీప్ కమిషనర్ జి.జయలక్ష్మి
ప్రజాశక్తి – ఎఎన్‌యు : చట్టపరిధికి లోబడి సహజ న్యాయ సూత్రాలను అన్వయిస్తూ రీసర్వేను పూర్తి చేయాలని, గతంలో జరిగిన తప్పిదాలను అధిగమించాలని సిసి ఎల్‌ఎ ఛీప్ కమిషనర్ జి.జయలక్ష్మి చెప్పారు. రీసర్వే డ్పిఊ్యటీ తహశీల్ధార్లకు ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి శిక్షణలో ఆమెమాట్లాడుతూ రీసర్వే డిటిలకు విస్తృత అధికారాలు కల్పించామని, వాటిని సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలని అన్నారు. కొందరు చేసిన తప్పిదాల వల్ల రెవెన్యూ రికార్డుల్లో లోపాలను అధికమించి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా స్పష్టమైన రికార్డుల రూపకల్పనకు మార్గం సుగమం చేయాలన్నారు. తప్పులు చేసే వారిపై కఠిన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల సంచాలకులు డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీగా, రైతుల సంతృప్తే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పులకు అవకాశం ఉండకూడదన్నారు. రెవిన్యూ సదస్సుల్లో 2.80 లక్షల ఫిర్యాధులు వచ్చాయని, యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేసి భవిష్యత్తులో ఈ సమస్యలు ఎదురు కాకుండా చూడాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను తమ దృష్టికి తేస్తే వాటి పరిష్కారానికి అవసరమైతే చట్ట సవరణలూ చేస్తామని చెప్పారు. సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల అదనపు సంచాలకులు గోవిందరావు మాట్లాడుతూ బ్రిటీష్ కాలం తరువాత అధునిక పరిజ్ఞానం వినియోగించి చేస్తున్న రీసర్వే విజయవంతం కావాలంటే ప్రతి ఒక్క అధికారి సమస్యలను లోతుగా అవగాహన చేసుకుని పరిష్కారం చూపాలని కోరారు. శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రీసర్వే డిప్యూటీ తాహశీల్ధార్‌లు 550 మంది హాజరవగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవతేజ, కేంద్ర కార్యాలయం ఉప సంచాలకులు డిఎల్ బిఎల్ కుమార్, ప్రాంతీయ సంయిక్త సంచాలకులు కెజియా కుమారి, సహాయ సంచాలకులు ఎంవి రంగప్రసాద్, ప్రశాంతి, ఎవిఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.
