సమ్మె ఒప్పంద జిఒలను విడుదల చేయాలి

Jan 10,2025 21:25

ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్‌/సాలూరు/పాలకొండ : కూటమి ప్రభుత్వం ఏర్పడి 7నెలలు గడుస్తున్నా నేటికీ మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం చాలా అన్యాయమని, సమ్మె కాలం నాటి ఒప్పందాలకు సంబంధించిన జిఒలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలో గల మున్సిపల్‌ కార్యాలయాల వద్ద ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన పారిశుధ్య కార్మికులు శుక్రవారం ధర్నా, రిలేనిరాహారదీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేయగా, సాలూరు మున్సిపాల్టీ, పాలకొండ నగర పంచాయతీ కార్యాలయాల వద్ద రిలేనిరాహారదీక్షలు చేపట్టారు.పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులతో కలిసి సిఐటియు జిల్లా కోశాధికారి జి.వెంకటరమణ ధర్నా నిర్వహించారు. అనంతరం శానిటర్‌ ఇన్స్పెక్టర్‌ పకీర్‌రాజుకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వెంకటరమణ, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు సిహెచ్‌ సింహాచలం, నాగవంశం శంకర్రావు మాట్లాడుతూ గతంలో మున్సిపల్‌ కార్మికులు చేసిన పోరాటానికి నాటి ప్రతిపక్షం, ప్రస్తుత అధికార ప్రభుత్వ టిడిపి నాయకులు కార్మికులకు మద్దతు తెలిపారని, నేడు అధికారం చేపట్టిన అనంతరం పూర్తిగా దాన్ని విస్మరించారని విమర్శించారు. కార్మికులకు అందించాల్సిన కనీస అవసరాలు కూడా కల్పించకుండా ప్రభుత్వం పెడచెవిన పెట్టడం బాధాకరమని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు పి.రాజశేఖర్‌, కార్మికులు మామిడి శివ, బంగారు రవి, బంగారు రాజేష్‌, గుంటూరు గంగయ్యలు, మంగళగిరి శ్రీను, గంగరాజు, శివ, సీతమ్మ, ఇప్పలమ్మ, సుజాత, పాపమ్మ మరియు వర్కర్లు మేస్త్రిలు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

సాలూరు : 2023 డిసెంబర్లో 17 రోజులు సమ్మె సందర్భంగా అప్పటి ప్రభుత్వం, అధికారులు చేసిన ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు టి.రాముడు, టి.శంకర్రావుతో కలిసి యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్‌వై నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పలు దఫాలు పురపాలక శాఖ మంత్రికి విన్నవించినా, పరిష్కరించాలేదన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే మరో సమ్మె, చలో విజయవాడ నిర్వహించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. తక్షణమే గత సమ్మె హామీలైన రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.75వేలకు పెంచాలని, రిటైర్మెంట్‌ వయసు 62ఏళ్లకు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కార్మికులకు వర్తింపజేయాలని, దహన సంస్కార ఖర్చులకు ఇచ్చే మొత్తాన్ని రూ.20వేలకు పెంచడం, జీవో ను అమలు చేసి ఇంజనీరింగ్‌ సెక్షన్‌లో గల కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. జీవో 36ను అమలు చేసి డ్రైవర్లకు జీతాలు చెల్లించాలని కోరారు. మృతి చెందిన పారిశుధ్య కార్మికుని కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీక్షల్లో మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా మహిళా కన్వీనర్‌ టి.ఇందూ, నాయకులు వెంకన్న, ప్రసాదు, కేశవ, వాసు, గంగమ్మ పాల్గొన్నారు.

పాలకొండ : మున్సిపల్‌ (ఆప్కాస్‌ )కార్మికులకు సమ్మె కాలపు హామీలకు వెంటనే జీవోలు ఇవ్వాలని కోరుతూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు ) పాలకొండ నగర పంచాయతీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్షలు సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ సమ్మె ఒప్పందాలు అమల్లో నిర్లక్ష్యం ప్రభుత్వం విడనాడాలని సమస్యలు పరిష్కారమయ్యే వరకు దశల వారి పోరాటాలు ఉధృతం చేయాలని అన్నారు. దీక్షల్లో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ పాలకొండ కమిటీ కార్యదర్శి సిహెచ్‌ సంజీవి, సభ్యులు ఎన్‌.సాయికుమార్‌, సిహెచ్‌ కార్తీక్‌, పి.సూరిబాబు పాల్గొన్నారు. రిలే నిరాహార దీక్ష శిబిరానికి మద్దతుగా పి.వేణు, సిహెచ్‌ అప్పలనాయుడు, సిహెచ్‌ కృష్ణవేణి, బాబురావు, ఈశ్వరకుమారు, కె.నరసింహులు, శివ, ప్రజాసంఘాల నాయకులు దూసి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

➡️