ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని, పెరిగిన పట్టణ అవసరాలకు అనుగుణంగా కార్మికులను నియమించాలని, కార్మికుల పట్ల వేధింపులను ఆపాలని తదితర డిమాండ్లతో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, ఇంజినీరింగ్ విభాగం కార్మికులు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో నరసరావుపేటలో మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం రీలే నిరాహారదీక్ష చేపట్టారు. దీక్షలను శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి ప్రారంభించి మాట్లాడారు. ఒప్పందాలను ప్రభుత్వం అమలు చేయకపోతే మెరుపు సమ్మెకు సిద్ధంగా ఉండాలన్నారు. సమ్మె సందర్భంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు మద్దతుగా మాట్లాడారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ సిలార్ మసూద్ మాట్లాడుతూ సమ్మె సందర్భంగా అప్పటి ప్రభుత్వం రూ.6 వేలు హెల్త్ ఇన్సూరెన్స్‌ను జీతంతో కలిపి ఇచ్చారని, మిగిలిన హామీలు అమలు చేయాలన్నారు. ఇంజినీరింగ్ కార్మికులకు జిఓ 36 ప్రకారం రూ.24 వేలు వేతనాలు అమలు చేయాలన్నారు. రిటైర్ అయిన కార్మికుల స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, రక్షణ పరికరాలు, ఇంజినీరింగ్ కార్మికులకు టూల్ కిట్లు ఇవ్వాలని కోరారు. కార్మికులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావుకు వినతిపత్రం అందజేశారు. చిన్న అల్లాబక్షు, సోమశేఖర్, డి.నాగభూషణం, గౌస్‌బాషా, పి.రమేష్, నాగేశ్వరరావు, ఎస్.కోటేశ్వరరావు, ఖాసిం, సయ్యద్ కరీం, ఖాదర్, ఇంద్రయ్య, జి.సామ్రాజ్యం, రమణ, షైలు, కె.సమాధానం, మల్లేశ్వరి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-సత్తెనపల్లి : స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఒకరోజు దీక్షలో యూనియన్ (సిఐటియు) జిల్లా నాయకులు చంద్రకళ మాట్లాడారు. కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. ఎన్‌ఎంఆర్, బదిలీ, కోవిడ్ కార్మికులకు జీవో 36 ప్రకారం జీతాలు పెంచాలని కోరారు. క్రాఫ్ట్ డ్రైవర్లకు ప్రతినెల జీతాలు చెల్లించాలని, జీతాలు పెంచాలని, పర్మినెంట్ కార్మికులకు జిపిఎఫ్ అకౌంట్లు, సరెండర్ లీవులు అమలు చేయాలని కోరారు. దీక్షకు సిఐటియు నాయకులు జె.రాజకుమార్, పి.మహేష్ మద్దతు తెలిపారు. బొమ్ము రాజశేఖర్, సిహెచ్ ప్రభు కుమార్, జి.దుర్గా, వి.మార్తమ్మ, జి.మరియమ్మ, ఎం.సత్యవతి, సునీత, డి.సామ్రాజ్యం, పి.నాగేంద్రం, ఎన్.జయమ్మ, జి.వెంకాయమ్మ, జి.శ్రీను పాల్గొన్నారు.