పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు : జెసి

ప్రజాశక్తి-కాకినాడ : పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌, పిఠాపురం నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.రామ్‌ సుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మంగళవారం కాకినాడ జేఎన్టీయూలోని సీవిల్‌ డీపార్టమెంట్‌ పీజీ బ్లాక్‌ వద్ద చేపట్టిన ఏర్పాట్లను జెసి పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు- 2024లో పోలైన ఈవీఎంలు ఇతర పోలింగ్‌ సామాగ్రిని జేఎన్టీయూలో నియోజకవర్గాల వారీగా ఆయా బ్లాకుల్లో సురక్షితంగా భద్రపరిచడం జరిగిందన్నారు. అదేవిధంగా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్‌ బ్యాలెట్‌లను జేఎన్టీయూలోని సీవిల్‌ డీపార్టమెంట్‌ పీజీ బ్లాక్‌లోను, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోస్టల్‌ బ్యాలెట్లను ఆయా నియోజకవర్గాల స్ట్రాంగ్‌ రూముల వద్ద ఓట్లు లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని ప్రసంత వాతావరణంలో పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన సూచించారు.

➡️