ప్రజాశక్తి-రాయచోటి ప్రజల ప్రాణభద్రత మనందరి సామాజిక బాధ్యతని, ఆ దిశగా జిల్లాలో రహదారుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారుల భద్రత సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అజెండా అంశాలపై సమీక్షించారు. ఇందులో జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల ప్రమాద డేటా విశ్లేషణ, 3 కంటే ఎక్కువ మరణాలపై ఉమ్మడి తనిఖీ అంశాలపై సవీ ుక్షించారు. ఇంటిగ్రేటెడ్ రోడ్డు యాక్సిడెంట్స్ అండ్ డెత్ డేటాపై సమీక్షించారు. వచ్చే ఏడాది 2024-2025 కోసం జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులలో బ్లాక్ స్పాట్‌లను గుర్తించి, సరిదిద్దడానికి కార్యాచరణ ప్రణాళికను అమలు పరచడం, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, హిట్ అండ్ రన్ కేసుల బాధితులకు పరిహారం, గత రోడ్డు భద్రత సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించారు.ఇందులో 2023, 2024లో ఇప్పటి వరకు చోటు చేసుకున్న ప్రమాదాలపై సమీక్షించారు. 2023లో మొత్తం 593 ప్రమాదాలు జరుగగా, ఇందులో 274 ప్రాణాంతకం కేసులు, 319 ప్రాణాంతకం కానివి, 314 మరణాలు, 786 మంది గాయపడినట్లు తెలిపారు. అలాగే 2024లో అక్టోబర్ మా సొంతం వరకు మొత్తం 533 ప్రమాదాలు జరుగగా, ఇందులో 255 ప్రాణాంతకం కేసులు, 278 ప్రాణాంతకం కానివి, 289 మరణాలు, 656 మంది గాయపడినట్లు నివేదికలు సూచిస్తున్నాయని ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై నుంచి అక్టోబర్ మాసం వరకు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దష్టి సారించిన ఫలితంగా గతంలో ఇదే సమయానికి 2023 కంటే 2024లో 10.11 శాతం రోడ్డు ప్రమాదాలలో తగ్గుదల ఉన్నట్లు అధికారులు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అత్యధిక శాతం రోడ్డు ప్రమాదాల కారణంగానే ప్రాణాలు కోల్పోవడం జరుగు తోందన్నారు. జనాభాతో పాటు వాహనాలు వినియోగం కూడా పెరుగుతున్న నేపథ్యంలో రవాణా శాఖ, పోలీసు, అనుబంధ శాఖల అధికారులు రహదారుల భద్రతపై ప్రత్యేక దష్టి సారించి వాహన ప్రమాదాలను అరికట్టే దిశగా భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా ప్రమాణాలు పాటించాలని, అవగాహనతోనే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని పేర్కొన్నారు. వాహనాల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బారికేడ్స్, స్టాపర్స్, ప్రమాద సంకేత సూచికలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్లు, ఆసుపత్రులు ఉన్నచోట స్పీడ్ బ్రేకర్స్, బేరి గేడింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ పై అవగాహనతో ఉండాలని, రోడ్ సేఫ్టీలో పాటించాల్సిన నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. అజాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఈ విషయమై ప్రతి ఒక్కరూ సీరియస్‌గా ఆలోచిం చాలన్నారు. ప్రతి ఒక్కరూ వారి కుటుంబాన్ని దష్టిలో పెట్టుకుని వాహనాలు నడపాలని, ప్రతి ఒక్కరు సురక్షితంగా బయటికి వెళ్లి తిరిగి వచ్చేలా జాగ్రత్తగా పాటించాలన్నారు. జీవితం కంటే ఏది ముఖ్యం కాదని తెలుసుకోవాలన్నారు. అతివేగం ప్రమాదకరంన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాఠశాలలు కళాశాలలు ప్రజలకు విస్తత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అన్ని బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని, ప్రతి రహదారి మలుపు వద్ద సూచిక బోర్డులు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను ముమ్మరం చేయాలన్నారు. సమావేశంలో జెసి ఆదర్శ్ రాజేంద్రన్, సబ్ కలెక్టర్లు మేఘస్వరూప్, నైదియాదేవి, ఆర్‌డిఒ శ్రీనివాస్, ఆర్‌టిఒ ప్రసాదు, ఎంవిఐలు, పోలీస్ శాఖ అధికారులు, డిఎస్‌పిలు, ఆర్‌అండ్‌బి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.