ప్రజాశక్తి – రాయచోటి జిల్లాలో ఎట్టి పరిస్థితులలో డయేరియా ప్రబలకుండా పటిష్టంగా నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం రాయచోటి కలెక్టరేటలో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి డయేరియా నివారణ చర్యలు, జింక్ మాత్రలు, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ, ఇమ్యునైజేషన్, డేటా ఎంట్రీ అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ మండల వైద్యాధికారులు, సిహెచ్‌ఒలు, సూపర్‌వైజర్లు, ఎంఎల్‌హెచ్‌పిలు, ఎఎన్‌ఎంలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అన్ని మండలాలలో జింక్ మాత్రలు, ఒఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ, ఇమ్యునైజేషన్, డేటా ఎంట్రీ అంశాలలో ప్రగతి సాధనలో వెనకబడడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితులలో జిల్లాలో డయేరియా ప్రబలకుండా నివారణ చర్యలను పటిష్టంగా అమలుపర చాలన్నారు. ప్రతి ఇంటికీ ఆశా కార్యకర్త వెళ్లి రెండు ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం చేతులు పరిశుభ్రత గురించి, తాగునీటి కలుషితం లేకుండా చూడడం పిల్లలకు డయేరియా వస్తే వెంటనే జింక్ మాత్రలు సరఫరా చేయడం తప్పనిసరిగా జరగాలన్నారు. డయేరియా వస్తున్న ప్రాంతాలలో నీటి పరీక్షలు కూడా చేయాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున ఎక్కువగా కేసులు వస్తాయని, వాటిపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గ్రామాలలో నీటి నిల్వలు, నీరు కలుషితం కాకుండా చూడాలని పేర్కొన్నారు. ఎక్కడైనా నీరు కలుషితం అయితే వెంటనేపై అధికారులకు తెలియజేయాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి చేతుల శుభ్రత ఎలా చేసుకోవాలి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, తల్లులు బిడ్డలకు పాలిస్తున్నప్పుడు, మోషన్ వెళ్ళినప్పుడు ఎలా శుభ్రత పాటించాలో వివరించాలన్నారు. పిహెచ్‌సి, అంగన్వాడీ కేంద్రాల్లో ఒఆర్‌ఎస్ కార్నర్ ఏర్పాటు చేసి ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచి ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏ విధంగా వినియోగించాలి, జింక్ మాత్రలు ఏ విధంగా వాడాలి తదితర అంశాలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. రెండు మూడు రోజుల తర్వాత తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని ఎక్కడైనా ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు అందలేదని, ఆశాలు, ఎఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పిలు వారి పరిధిలోని ఇళ్లను సందర్శించలేదని తెలిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరూ విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా శ్రద్ధ పెట్టి బాధ్యతాయు తంగా పని చేయాలన్నారు. వివిధ అంశాలలో కొన్ని మండలాల వారు తరచూ ప్రగతిలో వెనకబడి ఉంటున్నారని, అంటే అక్కడ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని అర్థం అవుతుందన్నారు. అలాంటి చోట డిఎంహెచ్‌ఒ, డిఐఒ, డిపిఎంఒలు క్షేత్రస్థాయిలో విస్తతంగా పర్యటించి లక్ష్యాలను సాధించేలా కషి చేయాలన్నారు. ప్రగతి సాధనలో వెనుక పడితే మెడికల్ అధికారులే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం వైద్య శాఖకు ఏయే బాధ్యతలు అప్పగించింది అందులో మన పనితీరు ఎంత అన్నది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. మనలో కొంతమంది బాగా పని చేస్తూ ప్రగతి సాధనలో ముందున్నారు. ప్రగతిలో వెనుకబడిన వారు బాగా పనిచేస్తున్న వారితో మాట్లాడి లోపాలు గుర్తించి తమ పనితీరును సరిదిద్దుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, డిఎంహెచ్‌ఒ డాక్టర్ కె.కొండయ్య, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, జిల్లా మలేరియా అధికారి, డిపిఎమ్‌ఒ, వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, ఎంఎల్ హెచ్‌పిలు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
