ఉద్యోగ భద్రత కోసం పోరుబాట

Oct 1,2024 00:25

గుంటూరులో ర్యాలీ నిర్వహిస్తున్న కార్మికులు, నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా :
కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ తదితర పేర్లతో ప్రభుత్వాలు వెట్టిచాకిరీ తమతో చేయిస్తున్నాయని ఉద్యోగులు, కార్మికులు విమర్శించారు. శాశ్వత పని ప్రాతిపదిక పనిచేయుచున్న పర్మినెంట్‌ కానటువంటి కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌, పీస్‌రేట్‌, ఎన్‌ఎంఆర్‌, డైలీవేజ్‌, థర్డ్‌పార్టీ రకరకాల పేర్లతో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులను రెగ్యులర్‌ చేయాలని సిఐటియు దేశ వ్యాప్తంగా డిమాండ్స్‌ డేలో భాగంగా సోమవారం గుంటూరు, పల్నాడు జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టరేట్‌ వరకూ సిఐటియు ఆధ్వర్యంలో ప్రదర్శన చేయగా వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్‌ యునియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సిఐటియు జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌, డైలీవేజ్‌, పీస్‌ రేట్‌, ఎన్‌ఎంఆర్‌ తదితర ముద్దు పేర్లతో ఆయా ఉద్యోగుల శ్రమను దోచుకుంటుందని, కనీస వేతనాలు అమలు కాక చాలీచాలని వేతనాలతో బతుకీడుస్తున్నారని విమర్శించారు. ఒకే విధమైన పని చేస్తున్న పర్మినెంట్‌ ఉద్యోగికి ఒక రకంగా, తాత్కాలిక ఉద్యోగికి మరొక రకంగా వేతనం ఇవ్వటం అన్యాయమన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పుఇచ్చినా అమలు కావట్లేదన్నారు. కనీసం చట్ట ప్రకారం కల్పించాల్సిన పిఎఫ్‌, ఇఎస్‌ఐ, గ్రాట్యూటీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అమలు కావడం లేదన్నారు. మహిళలు పనిచేసే చోట తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గతంలో సాధించుకున్నవి కూడా పోరాట ద్వారానే సాధించుకున్నాం అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 1 నుండి 30వ తేదీ వరకూ సిఐటియు జాతీయ కౌన్సిల్‌ పిలుపులో భాగంగా జిల్లాలో అనేక పరిశ్రమలు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులను సర్వే నిర్వహించమన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు, ఉన్నత విద్యాలయాలు, ప్రైవేటు విద్యాసంస్థలు అనేక చోట్ల కనీస వేతనాల అమలు కావడం లేదన్నారు. ఉద్యోగ భద్రత లేక తీవ్రమైన ఆందోళనలో కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు, ఉద్యోగులు ఉన్నారన్నారు. అత్యవసర సేవలు నిర్వహిస్తున్న వారిని సైతం కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించడం సరికాదన్నారు. హైకోర్టు, సచివాలయం వంటి వాటి చోటకూడా కనీస వేతనాలు అమలు కావడం లేదని అన్నారు. పీస్‌రేట్‌ కార్మికులు రకరకాల పేర్లతో ఉన్న కార్మికులందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. నరసరావుపేటలో యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్‌ యునియన్‌ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు జె.రాజశేఖర్‌, సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయులు నాయక్‌ మాట్లాడుతూ విద్యుత్‌ రంగంలో దీర్ఘకాలంగా కాంటాక్ట్‌ విధానంలో పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్‌ చేసి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ ఇతర బోనస్‌లు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలన్నారు. విశాఖ, విజయవాడ, ఇతర చోట్ల పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల్లో కాంటాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ సిబ్బంది మృతి చెందారని, ఈ నేపథ్యంలో పని ప్రాంతాల్లో రక్షణ చర్యలను యాజమాన్యాలు విస్మరిస్తున్నాయని విమర్శించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయకుంటే దశలవారీ పోరాటాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో మధులతకు వినతిపత్రం అందజేశారు. గుంటూరులో సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు, కె.శ్రీనివాసరావు, వి.దుర్గారావు, షేక్‌ హుస్సేన్‌వలి, కార్యదర్శులు బి.ముత్యాలరావు, ఎం.భాగ్యరాజు, ఎం.రమేష్‌బాబు, నాయకులు కె.బాబుప్రసాద్‌, ఎం.బాలాజీ, ఎం.రవి, ఎస్‌ఎం.వలి, గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి చింతల శ్రీనివాసరావు, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.పవన్‌, జి.నాగరాజు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు వేణు, వెంకటేశ్వరావు, యూనివర్సిటీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు గోపాల్‌, సునీత నాయకులు హనుమంతరావు పాల్గొన్నారు. నరసరావుపేటలో సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతరెడ్డి, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి, సిఐటియు పట్టణ అధ్యక్షులు షేక్‌ సిలార్‌ మసూద్‌, నాయకులు మల్లయ్య, కె.రామారావు, మస్తాన్‌వలి పాల్గొన్నారు.

నరసరావుపేటలో ఆర్డీఓ మధులతకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

➡️