13న ర్యాలీ..కలెక్టర్‌కు వినతి
వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రైతుల పంటలకు గిట్టు బాటు ధర కల్పించాలని, పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని,రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ ఈనెల 13న వైసిపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, కలెక్టర్‌కు వినతి ఇవ్వనున్నామని వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జిశ్రీనివాసరావు తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముందుగా గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో, జిల్లాలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. రైతులను ఆదుకొనే పరిస్థితి లేదన్నారు. ఈ నేపధ్యంలో రైతులను ఆదుకోవాలని కోరుతూ ఈనెల 13న వైసిపి ఆధ్వర్యాన విజయనగరంలో ర్యాలీ నిర్వహించి, కలెక్టర్‌కు వినతి పత్రం అందించనున్నట్లు తెలిపారు. 27న కరెంట్ ఛార్జీల మోతపై నిరసన, జనవరి 3న విద్యార్థులకు బాసటగా నిలదీత వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వీటితో పాటు సూపర్ సిక్స్ హామీల అమలుకు డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తామని తెలిపారు. సమావేశంలో వైసిపి నాయకులు కెవి సూర్య నారాయణరాజు, నెక్కల నాయుడుబాబు , జై హింద్ కుమార్, ఆశాపు వేణు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.