విద్యార్ధులు మరింత విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి : జిల్లా కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురం (మన్యం) : విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలకు వెళ్లే విద్యార్థులందరూ తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ అభిలషించారు. జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిధిగా పాల్గని బస్సుకు జెండా ఊపి లాంచనంగా ప్రారంభించారు. గతంలో జిల్లాలో నిర్వహించిన విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్ధులందరూ తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకునేలా విశాఖపట్నంలోని కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, ఆర్‌ కె బీచ్‌ వద్ద గల ఐఎన్‌ఎస్‌ కుర్పురా సబ్‌ మెరైన్‌ మ్యూజియం, ఎయిర్‌ క్రాప్ట్‌ మ్యూజియం, ఆర్కియాలజీ మ్యూజియంలను సందర్శించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. విద్యార్ధులందరూ ఆయా ప్రాంతాల్లో కొత్త విషయాలను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని, ఆ విధంగా తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకొని, భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలకు నాంధి పలకాలని కలెక్టర్‌ ఆశాభావం వ్యక్తం చేసారు. మండలానికి మూడు పాఠశాలలు చొప్పున జిల్లాలోని 15 మండలాల నుంచి 45 మంది విద్యార్ధులు ఈ విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలకు బయలుదేరినట్లు జిల్లా విద్యా శాఖాధికారి డా.ఎన్‌.తిరుపతి నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు ఉన్నారు.

➡️