ప్రజాశక్తి-వెలిగండ్లదసరా సెలవుల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వెలిగండ్ల ఎస్‌ఐ మధుసూదనరావు కోరారు. సెలవులు రావడంతో విద్యార్థులు ఈత కొట్టడానికి కుంటలు, వాగుల్లోకి వెళ్లి మునిగి ఈతరాక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, తల్లిదండ్రులు పిల్లలపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో సమావేశం నిర్యహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సెలవుల్లో చాలామంది చిన్నారులు తాతయ్య వారి ఊళ్లకు, బంధువుల ఇళ్లకు వెళతారని, మరికొంత మంది ఇళ్ల వద్దే కాలక్షేపం చేస్తుంటారని అన్నారు. ఈ సమయంలో ఆడుకునేందుకు బయటకు వెళ్తున్న పిల్లల పట్ల తల్లిదండ్రులు, ఇంటి పెద్దలు దృష్టి సారించాలని అన్నారు. ముఖ్యంగా చెరువులు, నదుల వద్దకు వెళ్లకుండా చూడాలని అన్నారు. మండలంలో ఇలా ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో ఎంతోమంది విద్యార్థులు ఏదో ఒక రూపంలో మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగకుండా పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలన్నారు. ఎండల బారినపడి అనారోగ్యానికి గురికాకుండా, ఇతర ప్రమాదాల బారిన పడకుండా ప్రత్యేక దృష్టి సారించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.