ప్రజాశక్తి-యర్రగొండపాలెం : యర్రగొండపాలెం పట్టణంలోని మాచర్ల-మార్కాపురం 565 జాతీయ రహదారికి ఆనుకొని ఆర్‌అండ్‌బి బంగ్లా సమీపంలో గల సర్వే నెంబర్ 58/1, 559లో గల స్థలాలను అన్యాక్రాంతం చేసి అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశాల మేరకు మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్ సోమవారం యర్రగొండపాలెం వచ్చారు. ఈ రెండు సర్వే నెంబర్లను తనిఖీ చేశారు. రెవెన్యూ సర్వేయర్లతో కొలతలు వేయించారు. రికార్డులు పరిశీలించారు. సర్వే నెంబర్ 58/1లో ఉన్న స్థలంలో ఐదు కుంటల స్థలం వెలగపూడి బ్రహ్మాజీ పేరుతో ఉంది. అయితే అది దొడ్డపనేని శ్రీనివాసరావు భార్య యోగమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ జరిగింది. ఇది అక్రమ రిజిస్ట్రేషన్ అని, తమకు తెలియకుండానే అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బ్రహ్మాజీ అన్నయ్య తిరుమలరావు పోలీసులను, రెవెన్యూ అధికారు లను ఆశ్రయించాడు. అలాగే 559లో ఆర్‌అండ్‌బి రహదారిని సైతం ఆక్రమించి అక్రమ రిజిస్ట్రేషన్‌కు పాల్పడ్డారని తెలియడంతో ఈ రెండు సర్వే నెంబర్లపై మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్ విచారణ చేపట్టారు. ముందుగా తహశీల్దార్ కార్యాలయం లో సంబంధిత రికార్డులను పరిశీలించారు. అనంతరం రిజిస్ట్రేషన్ జరిగేందుకు అధికారులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించారు. ధ్రువీకరణ పత్రంలో సంతకాలు చేసిన అధికారులను విడివిడిగా ప్రశ్నించారు. వారి నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఈ సందర్భంగా మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్ విలేకర్లతో మాట్లాడుతూ నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపనున్నట్లు తెలిపారు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిటి నలగాటి మల్లికార్జున నాయుడు, సబ్ రిజిస్ట్రార్ షేక్ సుల్తాన్ బాషా, పంచాయతీ కార్యదర్శి ఈదుల రాజశేఖర్‌రెడ్డితో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
