పారదర్శకంగా ఓటర్ల జాబితా : సబ్‌ కలెక్టర్‌

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ పారదర్శకంగా ఓటర్ల జాబితా ఉండాలన్న లక్ష్యంతో అన్ని రాజకీయ పార్టీల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ మేఘ స్వరూప్‌ తెలిపారు. శనివారం స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఓటర్ల జాబితా ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో 2,66,800 ఓటర్లు ఉన్నారని, వీరిలో 2,66,208 మందిని సర్వే చేశామని తెలిపారు. మిగిలిన వారు అందుబాటులో లేకపోవడంతో వారి వివరాలు సేకరించలేకపో యామని పేర్కొన్నారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాలను మార్చాల్సిన అవసరం ఉందని, వాటిలో 37, 72 బూతులు ఉన్నట్లు తెలిపారు. 1500 ఓటర్లకు పైబడి ఉన్న పోలింగ్‌ బూత్‌ను రెండు బూత్‌లుగా చేస్తామన్నారు. రాజకీయ పార్టీలు బూత్‌ లెవల్‌ ఏజెన్సీ ఏర్పాటు చేసుకొని, బిఎల్‌ఒలతో సమన్వయం చేసుకుని ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని నివత్తి చేసుకోవాలన్నారు. డబుల్‌ ఎంట్రీ ఉన్న ఓట్లు, ఒకే ఇంటి నెంబర్‌తో ఉన్న బోగస్‌ ఓటర్లు, స్థానికేతర ఓట్లు, చనిపోయిన వారి ఓట్లును గుర్తించాలని తెలిపారు. బోగస్‌ ఓట్లను తొలగించేందుకు వీలు ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్ర కాలనీలో నాలుగు పోలింగ్‌ బూతులు ఉన్నాయని అయితే అక్కడ ఉన్నవారికి స్థానికంగా ఉన్న పోలింగ్‌ బూత్‌లో కాకుండా మరో ప్రాంతంలో ఓటు ఉండడం, వేరే ప్రాంతాల్లో ఉన్న వారికి చంద్రాకాలనీ లోని పోలింగ్‌ బూతులో ఓటు ఉండడంతో ఇక్కడి వారు అక్కడికి పోలేక, అక్కడి వారు ఇక్కడికి రాలేక చిక్కులు వస్తున్నాయన్నారు. పోలింగ్‌ శాతం కూడా తగ్గతోందని ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. నివాస ప్రాంతాల్లో ఉన్న వారికి ఆ ప్రాంతంలోనే పోలింగ్‌ బూతు కేటాయిస్తే ఓటర్లకు అనుకూలంగా ఉండడంతో పాటు ఓటు శాతంకూడా పెరుగుతుందని సూచించారు. స్పందించిన సబ్‌ కలెక్టర్‌ ఈ విషయాన్ని పరిశీలించి తగు పరిష్కారం చేద్దామన్నారు. ఓటర్లు సైతం చిరునామా మారే క్రమంలో బిఎల్‌ఒలను సంప్రదించి ఓటరు కార్డులో మారిన అడ్రస్‌ను చేర్చుకుంటే వారికి ప్రాంతంలోనే ఓటు హక్కు కల్పించే విధంగా జాబితాలో మార్పులు చేపట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. సమావేశంలో టిడిపి, సిపిఎం, కాంగ్రెస్‌, జనసేన, బిజెపి, సిపిఐ నాయకులు బాలుస్వామి, శ్రీనివాసులు, రెడ్డి సాహెబ్‌, జంగాల శివరామ్‌, భగవాన్‌, మురళి, మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం మండల తహశీల్దార్లు పాల్గొన్నారు.

➡️