చెరకు రైతుల్ని ముంచేశారు

Feb 15,2025 21:25

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఔను…! మొత్తానికి జిల్లాలోని భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలోని చెరకు రైతుల్ని పాలకులు ముంచేశారు. దశాబ్ధాల చరిత్రగల ఈ ఫ్యాక్టరీని మూసివేశారు. ఈ విషయం తాజాగా ఆ ఫ్యాక్టరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విఎస్‌ నాయుడు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనతో మరోసారి స్పష్టమైంది. ఈ విషయంలో నాటి వైసిపి, టిడిపి ప్రభుత్వాలు దొందూ దొందే. ఆయా పార్టీలు, ప్రభుత్వాలు చెరకు రైతులపై ఇన్నాళ్లూ కార్చింది మొసలి కన్నీరేనని స్పష్టమైంది. ఉమ్మడి విజయనగరం జిల్లా ఒకప్పుడు చెరకు సాగుకు పెట్టింది పేరు. జిల్లాలో పెద్దగా సాగునీటి వనరులు లేకపోవడం వల్ల చెరకు పంటే గత్యంతరంగా ఉండేది. దీనికితోడు ఆ పంట సాగుకు ఈ ప్రాంత భూములు కూడా ఎంతో అనువుగా ఉన్నాయి. ఈనేపథ్యంలో జామి మండలంలోని భీమసింగి దరి కుమరాంలో శ్రీ విజయరామ గజపతి కో-ఆపరేటివ్‌ సుగర్‌ ఫ్యాక్టరీని 1960లో అప్పటి ప్రభుత్వమే సహకారం రంగంలో ఏర్పాటు చేసింది. లక్ష్యానికి తగ్గట్టే ఈ ప్రాంత అభివృద్ధిలో ఫ్యాక్టరీ కీలకపాత్ర పోషించింది. పాలకుల నిర్లక్ష్యం వల్ల మారుతున్న టెక్నాలజీ అందుకోవడంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ రైతులకు ఎంతో ఆసరాగా నిలిచింది. ఒకప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే దీన్ని మూసివేసింది. 2004 ఎన్నికలకు ముందు వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన పాదయాత్రలో భాగంగా ఫ్యాక్టరీని తెరిపించేందుకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు మాట నిలబెట్టుకున్నారు. దీంతో, రైతులు ఒకింత ఊపిరి పీల్చుకుంటూ చెరకు సాగుపై మరింత ఉత్సాహం చూపారు. చెరకు స్థానికంగానే విక్రయించుకునే పరిస్థితి ఉండడం వల్ల రైతులు, తిరిగి పున:ప్రారంభం వల్ల అందులో పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు, ఉద్యోగుల జీవితాలకు భరోసా కలిగింది. చెరకు బళ్లు, రైతులు, కార్మికులు, ఉద్యోగులతో భీమసింగి ప్రాతంలో నిత్యం కళకళాడేది. 2014లో తిరిగి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సహకార రంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలు అవలంభించడంతో ఫ్యాక్టరీ మనుగడ కష్టనష్టాల్లోకి వెళ్లింది. 2019 ఎన్నికల ముందు ఈ ప్రాంత పర్యటనకు వచ్చిన వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి ఈ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తామని, తన తండ్రి పున:ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీని చంద్రబాబు కుదేలు చేశారు. ఈ మాటలు నమ్మిన ఈ జిల్లా, భీమసింగి ప్రాంతవాసులు వైసిపికి పట్టం కట్టారు. ఓడదాటే వరకు ఓడమల్లన్న…. ఓడ దాటకా బోడి మల్లన్న అన్నట్టుగా ఆధునీకరణ పేరిట 2019 ఆగస్టులో చెరకు క్రషింగ్‌ నిలిపివేశారు. ఎప్పటికీ తెరవరకపోవడంతో సిపిఎం ఆధ్వర్యాన రైతులు సుదీర్ఘమైన పోరాటాలు చేసిన సంగతి తెలిసిందే. నాటి జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ ఇదిగో అదిగో అంటూనే చివరికి ఫ్యాక్టరీ సామర్థ్యానికి తగ్గట్టు చెరకు సాగుచేయడంలేదంటూ రైతులపైకి నెట్టేశారు. గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం నోరు తెరవడం లేదు. పైగా జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని వ్యాఖ్యానించారు. ఫ్యాక్టరీని తెరిపించాలంటూ ఇటీవల రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఫ్యాక్టరీ ఎమ్‌డితో ప్రభుత్వం ఒక ప్రకటన ఇప్పించింది. ‘ఫ్యాక్టరీలో 2020-21 సీజన్‌ నుంచే చెరకు క్రషింగ్‌ నిలుపుదల చేశాం. ఇందులో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగులు, కార్మికుల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితోపాటు విఆర్‌ఎస్‌ వివరాలను 2022 జూన్‌ 12న జరిగిన ది గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ సమావేశం కోరింది’ అంటూ ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీన్ని బట్టి ఫ్యాక్టరీ మూతలో రెండు ప్రభుత్వాలదీ ఒకటే విధానం అన్నది తేలిపోయింది. ఫ్యాక్టరీ సామర్థ్యానికి తగ్గట్టు చెరకు సాగుచేయడం లేదంటూ రైతులపైకి పాలకులు నెట్టేశారు. కానీ, సాగు విస్తీర్ణం పెరగాలంటే చెరకు రైతులను ప్రోత్సహించాలి కాదా? అలా ప్రోత్సహించాల్సిన బాధ్యత, అవసరం ప్రభుత్వానికి లేదా? నాటి ప్రభుత్వం ఎందుకు అలాంటి ప్రయత్నం చేయలేదు అంటూ రైతులు, ఎపి రైతు సంఘం నాయకులు, చెరకు రైతుల సంఘం నాయకులు నాటి నుంచీ ప్రశ్నిస్తునే ఉన్నారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో చెరకు సాగు సాగువిస్తీర్ణం 50వేల ఎకరాలకుపైగా ఉండేది. వైసిపి ప్రభుత్వంలోగానీ, టిడిపి ప్రభుత్వంలోగానీ చెరకు పరిశోధనలు నిర్వహించలేదు. ఫలితంగా సుమారు పదేళ్లగా కొత్తరకం విత్తనాలు అందుబాటులో లేకపోవడం వల్ల దిగుబడి కూడా సగానికి సగం తగ్గిపోతోంది. సుగర్‌ రికవరీ రేటు కూడా మన రాష్ట్రంలో 9.5శాతానికి మించిరావడం లేదు. మరోవైపు చెరకు రైతులకు సబ్సిడీ పథకాలు లేవు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉత్పత్తికి అయ్యే ఖర్చుపై మద్ధతు ధర ప్రకటించకపోవడం వల్ల రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి. ధరలో లోటును భర్తీచేసే చెరకు పాలసీని కూడా పదేళ్ల క్రితమే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో, జిల్లాలో క్రమంగా సాగు విస్తీర్ణం తగ్గింది. ఇందుకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వమే రైతులపైకి నెట్టేయడం ఎంత వరకు సమంజసం అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందంటూ మంత్రి కొండపల్లి చేసిన వ్యాఖ్యలు కూడా నేటి ప్రభుత్వ విధానాన్ని, మోసకారి తనాన్ని బయటపెట్టాయి. వాస్తవానికి సహకార సంఘాలను ఏర్పాటుచేసింది లాభాలు ఆర్జించడం కోసం కాదు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా రైతులకు లేదా సంబంధిత రంగాలకు చెందిన ప్రజలకు చేదోడువాదోడుగా ఉండేందుకు. ఈ సంగతి అమాత్యులకు తెలియదనుకోలేం. చంపేయాలనుకున్న కుక్కపై పిచ్చికుక్కగా ముద్రవేసి పనికానిచ్చినట్టే… ఫ్యాక్టరీని మూసేయాలనే ప్రభుత్వ విధానంలో భాగంగానే ఆయన నోట వెనుక లాభనష్టాలు గుర్తుకు వచ్చాయి అనేది పబ్లిక్‌ టాక్‌.

➡️